కృషి.. పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చునని నిరూపిస్తున్నాడు సూక్ష్మ కళాకారుడు. అందరిలా ఆర్ట్ చేస్తే ఏం బాగుటుంది అనుకున్నాడు ఏమో..! భిన్నంగా ఏదో ఒకటి చేద్దామని సంకల్పించుకున్నాడు. అందుకు తగ్గ ప్రయత్నాలు చేశాడు. చిన్న చిన్న బొమ్మలు గీస్తూనే, తన కళకు పదును పెట్టాడు. ఇంకా ఏదైనా ఉన్నతంగా చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రథమ పూజలు అందుకునే వినాయకుడు రూపాన్ని బియ్యం, చింత గింజపై చెక్కి అబ్బుర పరిచాడు.
సూర్యాపేట జిల్లా కోదాడకు తమలపాకుల సైదులుకు చిన్నతనం నుంచే ఆర్ట్ పై మక్కువ ఉండేది. వివిధ రూపాలను బొమ్మలను గీస్తూ సూక్ష్మ కళాకారుడిగా ప్రతిభ చాటకున్నాడు. వినాయక చవితిని పురస్కరించుకుని సైదులు చింత గింజ, బియ్యపు గింజలపై, సుద్దముక్కపై వినాయక రూపాలను చెక్కిన సూక్ష్మ కళను ప్రదర్శించారు. 10మి.మీ పొడవు, 10మి.మీ. వెడల్పు ఉన్న చింతగింజపై, 19 మి.మీ ఎత్తు, 8మి.మీ వెడల్పు ఉన్న సుద్దముక్కపై,9మి.మీ ఎత్తు, 1.1 వెడల్పు ఉన్న బియ్యపు గింజపై వినాయక రూపాన్ని చెక్కి చూపరులను అబ్బుర పర్చాడు. ఒక్కో ప్రతిమ – చెక్కేందుకు అరగంట సమయం పట్టిందని సైదులు తెలిపారు. ఇంతకుముందు వివిధ సందర్భాల్లో పలు సామాజిక అంశాలపై సూక్ష్మ చిత్రాలను గీసి, అవార్డులను అందుకున్నాడు. మరోసారి తన సూక్ష్మ కళను ప్రదర్శించి పలువురి ప్రశంసలు అందుకున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..