Viral Video: అర్ధరాత్రి హైవేపై హైటెన్షన్.. అధికారులకు చుక్కలు చూపించిన భారీ మొసలి!
వనపర్తి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పెబ్బేరు మండలం తోమాలపల్లె గ్రామ సమీపంలోని హైవేపై అర్ధరాత్రి భారీ మొసలి సంచారం తీవ్ర కలకం రేపింది. రోడ్డుపై మొసలిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో..రంగంలోకి దిగిన అధికారులు మొసలిని పట్టుకొని కృష్ణానదిలో వదిలి పెట్టారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం తోమాలపల్లె గ్రామ సమీపంలోని హైవేపై అర్ధరాత్రి భారీ మొసలి సంచారం కలకలం సృష్టించింది. నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి సమీపంలో ప్రత్యక్షమైన మొసలిని చూసి అటువైపుగా ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత ఈ విషయంపై స్థానిక ఎస్సై వెంకటేశ్వర్ గౌడ్‌కు సమాచారం అందడంతో ఆయన వెంటనే స్పందించారు. అటవీశాఖ అధికారులు వెంకటయ్య, శ్రీను, నాగశేష్, వాచర్ వెంకటయ్యతో పాటు గ్రామ సర్పంచ్ అశోక్, ఇతర సిబ్బందిని అప్రమత్తం చేశారు. గ్రామ చెరువు నుంచి కాలువ ద్వారా రహదారిపైకి వచ్చినట్లు గుర్తించారు.
ఇక భారీ ఆకారంలో ఉన్న మొసలిని పట్టుకునేందుకు అధికారులు సుమారు రెండు గంటల పాటు శ్రమించారు. పట్టుకునే ప్రయత్నంలో మొసలి నోరు తెరిచి వెంబడించేందుకు ప్రయత్నించడంతో కాసేపు భయాందోళనకు గురయ్యారు. తర్వాత ధైర్యం చేసి తాళ్లతో పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు తొలుత ఫలించకపోవడంతో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు చాకచక్యంగా తాళ్లతో బంధించి, గ్రామ సర్పంచ్ సహకారంతో మొసలిని సురక్షితంగా తరలించే ఏర్పాట్లు చేశారు.
అనంతరం మొసలిని రంగాపూర్ సమీపంలోని కృష్ణానదిలో విడిచిపెట్టినట్లు ఎస్సై వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. అర్ధరాత్రి భారీ మొసలి హైవేపై కనిపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే సమయస్ఫూర్తితో స్పందించి మొసలిని సురక్షితంగా తరలించిన ఎస్సై వెంకటేశ్వర్ గౌడ్, అటవీశాఖ అధికారులను తోమాలపల్లె గ్రామ ప్రజలు అభినందించారు.
వీడియో చూడండి..
మరన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
