AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన ఆదివాసీ విప్లవ యోధుడికి ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళి!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్'లో కొమురం భీమ్ పోరాట గాథను ప్రస్తావించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీల హక్కుల కోసం, ముఖ్యంగా 'జల్-జంగల్-జమీన్' నినాదంతో పోరాడిన భీమ్ త్యాగాలను స్మరించారు. ఈ ప్రస్తావన ఆదివాసీ వీరుల చరిత్రకు జాతీయ గుర్తింపును అందించి, యువతకు స్ఫూర్తినిస్తోంది.

నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన ఆదివాసీ విప్లవ యోధుడికి ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళి!
Pm Modi Pays Tribute To Komaram Bheem
Naresh Gollana
| Edited By: |

Updated on: Oct 25, 2026 | 4:24 PM

Share

దేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఆదివాసీ వీరుల త్యాగాలకు ప్రత్యేక స్థానం ఉంది. అడవినే జీవనాధారంగా, భూమినే హక్కుగా భావించిన గిరిజన సమాజం కోసం పోరాడిన మహనీయుల్లో కొమురం భీమ్ ఒకరు. అణచివేతకు ఎదురొడ్డి, ఆదివాసీల ఆత్మగౌరవం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఈ గోండు వీరుడి పోరాట గాథ జాతీయ స్థాయిలో మరోసారి చర్చకు వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో కొమురం భీమ్‌ను స్మరించుకోవడం.. ఆయన చరిత్రను యువత తెలుసుకోవాలని పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అణచివేతపై అగ్గిరవ్వలా

హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలన కొనసాగుతున్న కాలం అది. ఆదివాసీలు, పేదలు భూస్వాముల దోపిడీకి, అటవీ ఆంక్షలకు, అధిక పన్నుల భారానికి గురయ్యేవారని ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. భూములపై హక్కులు కోల్పోతూ, తమ జీవనాధారమైన అడవులపై స్వేచ్ఛను కోల్పోతున్న గిరిజనుల పరిస్థితులు కొమురం భీమ్‌ను పోరాటం వైపు నడిపించాయి.

అన్యాయాన్ని ప్రశ్నించడం నేరంగా భావించిన పరిస్థితుల్లోనూ ఆయన వెనక్కి తగ్గలేదు. గిరిజనుల హక్కుల కోసం ప్రజలను సంఘటితం చేస్తూ, నిజాం పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఆయన పోరాటం కేవలం ఒక వ్యక్తి తిరుగుబాటు కాదు.. తరతరాలుగా తమ నేలపై జీవిస్తున్న ఆదివాసీల హక్కులు, స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం సాగిన ఉద్యమం.

‘జల్‌–జంగల్‌–జమీన్‌’.. తరతరాలకు స్ఫూర్తినిచ్చే నినాదం

జల్ జంగిల్ జమీన్.. ఇవే ఆదివాసీల జీవనానికి ఆధారాలు. ఈ మూడింటిపై తమకు హక్కులు ఉండాలని కొమురం భీమ్ బలంగా పోరాడారు. ‘జల్‌–జంగల్‌–జమీన్‌’ నినాదం ఆయన పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది. ఆదివాసీల భూములను స్వాధీనం చేసుకోవడం, అటవీ వనరులపై ఆంక్షలు విధించడం వంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ఆయన గిరిజనులను ఏకతాటిపైకి తీసుకొచ్చారు.

ఆసిఫాబాద్‌ ప్రాంతంలోని జోడేఘాట్‌ పరిసరాలు ఆయన పోరాటానికి ప్రధాన కేంద్రంగా నిలిచాయి. నిజాం పాలకుల సైన్యాన్ని ఎదుర్కొంటూ సాగించిన పోరాటంలో 1940లో కొమురం భీమ్ అమరుడయ్యారు. ఆయన మరణించినా.. గిరిజన హక్కుల కోసం చేసిన పోరాటం మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

మన్ కీ బాత్‌లో మోదీ నోట కొమురంభీమ్ మాట

2025 అక్టోబర్ 25న ప్రసారమైన ‘మన్ కీ బాత్‌’ 127వ ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కొమురం భీమ్ ధైర్యసాహసాలను ప్రస్తావించారు. నిజాం పాలనలో పేదలు, అణగారిన వర్గాలు, గిరిజనులు ఎదుర్కొన్న అణచివేతను వివరించారు. రైతుల పంటలను స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన నిజాం అధికారి సిద్ధిఖీని కొమురం భీమ్ ఎదుర్కొన్న ఘటనను ప్రస్తావిస్తూ, యువకుడిగా ఉన్నప్పుడే ఆయన అన్యాయాన్ని ధైర్యంగా ఎదిరించారని గుర్తుచేశారు.

కొమురం భీమ్ కేవలం 40 ఏళ్ల జీవితకాలంలోనే ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని ప్రధాని పేర్కొన్నారు. ముఖ్యంగా గిరిజన సమాజానికి ఆయన అందించిన స్ఫూర్తి అపారమని చెప్పారు. కొమురం భీమ్ చరిత్రను యువత విస్తృతంగా తెలుసుకోవాలని, దేశ చరిత్రలో తగినంత గుర్తింపు పొందని ఆదివాసీ మహనీయుల గురించి కూడా అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు.

జోడేఘాట్‌ నుంచి జాతీయ స్థాయి గుర్తింపు వరకు

కొమురం భీమ్ పేరు వినగానే ఆదిలాబాద్‌ గిరిజన ప్రాంతాలు, జోడేఘాట్‌ పోరాట గడ్డ గుర్తుకొస్తాయి. ఆయన జీవితం, త్యాగం ఆదివాసీ సమాజానికి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచాయి. స్థానిక గిరిజనుల జానపద గేయాలు, కథలు, స్మారక కార్యక్రమాల ద్వారా ఆయన పోరాట చరిత్ర తరతరాలకు చేరుతోంది.

ప్రధాని ‘మన్ కీ బాత్‌’ 127 ఎపిసోడ్‌లో లో ఆదివాసీల ఆరాద్య దైవం కొమురంభీమ్ ను స్మరించుకోవడం ద్వారా భీమ్ పోరాట గాథ దేశవ్యాప్తంగా మరింత మందికి చేరే అవకాశం ఏర్పడింది. గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను ప్రధాన స్రవంతి చరిత్రలో భాగం చేయాల్సిన అవసరాన్ని ఈ ప్రస్తావన మరోసారి గుర్తుచేసింది.

ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్‌’లో కొమురం భీమ్ త్యాగాన్ని స్మరించుకోవడం గర్వకారణమని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా పేర్కొన్నారు. జల్‌–జంగల్‌–జమీన్‌ హక్కుల పరిరక్షణ కోసం, ఆదివాసీల ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం భీమ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని తెలిపారు. ఆయన ఆశయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

అధికారం ముందు తలవంచకుండా.. అన్యాయంపై పోరాటమే మార్గంగా ఎంచుకున్న యోధుడు కొమురం భీమ్. జల్ జంగిల్ జమీన్ పై హక్కులు మాత్రమే కాదు.. గౌరవంగా జీవించే హక్కు కూడా ప్రతి మనిషికి ఉండాలనే స్ఫూర్తిని కొమురంభీమ్ ఆదివాసీ సమాజానికి అందించారు. జోడేఘాట్‌ అడవుల్లో మొదలైన ఆ పోరాట ప్రతిధ్వని ఇప్పుడు జాతీయ వేదికపై వినిపిస్తోంది. కొమురం భీమ్ చరిత్రను తెలుసుకోవడం అంటే ఒక వీరుడి త్యాగాన్ని స్మరించుకోవడమే కాదు.. ఆదివాసీల హక్కులు, వారి అస్తిత్వం, ఆత్మగౌరవం విలువను గుర్తించడం కూడా.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us