Telangana: ఏం మనిషివిరా.. మగబిడ్డ పుట్టలేదని భార్యకు నరకం చూపించాడు.. చివరకు..
మగపిల్లాడు పుట్టలేదన్న ఒకే ఒక్క ఆక్రోశం.. 18 ఏళ్లుగా కష్టసుఖాల్లో తోడున్న భార్య ప్రాణాలనే బలితీసుకుంది. పెళ్లయిన 12 ఏళ్లకు కడుపు పండి ఆడపిల్ల పుట్టినా సంతృప్తి చెందక.. తనకు మగ సంతానమే కావాలంటూ ఏళ్ల తరబడి కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. చివరకు మీ అమ్మాయిని తీసుకెళ్లకపోతే చంపేస్తానని అత్తమామలకు ఫోన్ చేసి బెదిరించిన కొన్ని గంటల్లోనే, భార్యను అత్యంత దారుణంగా గొంతు నులిమి హతమార్చాడు.

మగపిల్లాడు పుట్టలేదన్న ఆక్రోశంతో కట్టుకున్న భార్యనే అత్యంత కిరాతకంగా హతమార్చాడో భర్త. పథకం ప్రకారమే ఆమెను అంతమొందించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామానికి చెందిన నాతరి చంద్రయ్య తన కూతురు స్వరూపను సుమారు 18 ఏళ్ల క్రితం కరీంనగర్‌కు చెందిన దావు చంద్రకుమార్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లయిన దాదాపు 12 ఏళ్ల వరకు వీరికి సంతానం కలగలేదు. దీంతో ‘పిల్లలు పుట్టడం లేదు.. మరో పెళ్లి చేసుకుంటానంటూ చంద్రకుమార్ తరచూ స్వరూపను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించేవాడు. అనంతరం స్వరూపకు ఒక ఆడపిల్ల జన్మించింది. అయితే తనకు మగ సంతానమే కావాలంటూ అతడి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. నిత్యం మద్యం తాగి వచ్చి కొట్టడం, అర్ధరాత్రి వేళ పుట్టింటి వద్ద వదిలివెళ్లడం పరిపాటిగా మారింది. పెద్దలు పలుమార్లు పంచాయితీలు పెట్టి నచ్చజెప్పినా అతని తీరు మారలేదు.
బెదిరించిన కొన్ని గంటల్లోనే దారుణం
సంఘటన జరిగిన రోజు రాత్రి 9 గంటల సమయంలో చంద్రకుమార్ భార్యను తీవ్రంగా కొడుతూ, ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. మీ అమ్మాయిని తీసుకెళ్లండి.. లేదంటే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత అర్ధరాత్రి 12 గంటల సమయంలో చంద్రకుమార్ ఇంటి నుంచి ఒంటరిగా వెళ్లిపోవడాన్ని స్థానికులు గమనించారు. మరుసటి రోజు ఉదయం స్వరూప మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉండటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆమె మెడపై తీవ్రమైన గీతలు, కమిలిన గాయాలు కనిపించాయి. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
పోలీసుల దర్యాప్తు.. నిందితుడి కోసం గాలింపు
తన కుమార్తెను భర్త చంద్రకుమారే గొంతు నులిమి హత్య చేశాడని తండ్రి చంద్రయ్య కరీంనగర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మృతదేహానికి పంచనామా, పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు చంద్రకుమార్‌ను త్వరలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ. నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
