ఇంటిని అందంగా నిర్మించుకుంటాం. ఆ ఇంటికి మరింత అందాన్ని ఇముడింపజేసేందుకు ఇంటి చుట్టూ డిజైన్లతో కూడినపూల మొక్కలు, అందమైన శిల్పాలు ఏర్పాటు చేసుకుంటాం. ఇందుకోసం ఎంత ఖర్చైనా పెడుతుంటాం. కానీ, ఇతరుల స్ఫూర్తిని పొందేందుకు మహనీయుల విగ్రహాలను మాత్రం రహదారులు, కూడళ్లలోనే కనిపిస్తాయి.. కానీ యాదగిరిగుట్ట పాతగుండ్లపల్లిలో మాత్రం అందరూ ఆశ్చర్యపోయేలా ఓ ఇంటివారు తమ ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహం స్థానికుల్ని ఆకట్టుకుంటుంది. వివరాల్లోకి వెళితే..
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం పాత గుండ్లపల్లికి చెందిన తాళ్ల శ్రీనివాస్‌రెడ్డికి చిన్నప్పటి నుంచి చత్రపతి శివాజీ అంటే చాలా ఇష్టం. అభిమానం ఉండేది. శివాజీ స్ఫూర్తితో శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత దేశభక్తి, సేవా తత్వం బాగా పెరిగింది. శ్రీనివాస్ రెడ్డి ఏ పని చేసినా చత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకుని చేస్తుంటాడు. ఇదే క్రమంలో ఇటీవల పాత గుండ్లపల్లిలో నూతనంగా ఇంటిని నిర్మించుకున్నాడు. సాధారణంగా ఇంటి ముందు అందమైన డిజైన్ల పూల మొక్కలు, కలర్ఫుల్ స్టోన్స్ ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఆయన మాత్రం ఇంటి ముందు చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
ఈ విగ్రహం ఏర్పాటు కోసం అతడు మూడు లక్షల రూపాయలతో 10 అడుగుల ఎత్తులో పూర్తి ఫైబర్‌తో అశ్వంపై ఉన్న వీర శివాజీ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాడు. ఓటమి ఎరుగని వీరుడు, ప్రజల కోసమే పని చేసిన ప్రభువు, దేశభక్తి, జాతీయ అభిమానం చాటి, మహిళా రక్షకుడిగా దేశ చరిత్రలో కీర్తికెక్కిన రాజు శివాజీ అని శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. ఉదయం ఇంటి నుంచి బయటకు రాగానే శివాజీ విగ్రహన్ని చూసి స్ఫూర్తి పొందేందుకు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పాడు శ్రీనివాస్.
ప్రతి ఉదయం తనకి ఇష్టమైన ఆరాధ్య దేవుడి ఫోటో కంటే ముందుగానే శివాజీ విగ్రహాన్ని చూస్తుంటాడు. శివాజీ స్ఫూర్తితో దేశభక్తి, సేవా తత్వం ఆయన గురించి ఇక్కడి ప్రజలకు తెలియాలనే తన ఇంటి వద్ద విగ్రహం ఏర్పాటు చేసుకున్నానని, తన కుటుంబ సభ్యులు తండ్రి రాంరెడ్డి, కుమారుడు భరత్ సింహారెడ్డి సహకరించారని చెప్పాడు.