
వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజాం కాలంలో విస్తృతంగా సేవలు అందించిన
మామనూరు ఎయిర్‌పోర్ట్ కాలక్రమంలో తన కలను కోల్పోయింది. అయితే గత 5 ఏళ్లుగా వరంగల్ ఎయిర్‌పోర్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎట్టకేలకు శుక్రవారం రోజు మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అనుమతులిస్తూ కేంద్ర ప్రభుత్వం ఫైల్‌పై సంతకం చేసింది. అయితే ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కావాల్సిన మరో 253 ఎకరాలను భూసేకరణ త్వరగా పూర్తిచేయాలని కేంద్రం చెప్పింది. భూసేకరణ పూర్తి చేస్తే ఎయిర్‌పోర్ట్ నిర్మాణం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం రాకూడదని నిబంధన ఉన్న జిఎంఆర్ సంస్థతో మాట్లాడి ఒప్పించింది కేంద్రం. గత నవంబర్ 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో మామనూరు ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మమనూరు ఎయిర్‌పోర్ట్‌కి 949 ఎకరాల భూమి అవసరం కాగా.. ఇప్పటికే 696 ఎకరాలను భూమిని సమీకరించారు. మౌలిక వసతులు, ఇతర అవసరాలకు మరో రెండు వందల యాభై మూడు ఎకరాల స్థలం కావాల్సి ఉందని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కోరింది.
దీంతో నవంబర్ 17న భూసేకరణ కోసం వరంగల్ కలెక్టర్ 205 కోట్లను కేటాయించి 2025 మార్చిలోపు భూసేకరణ చేసేందుకు పనులు ప్రారంభించారు. దీంతో మొత్తం 223 మంది రైతులకు చెందిన 253 ఎకరాల భూమిని సమీకరించినందుకు పనులు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. మామనూరు ఎయిర్‌పోర్ట్ చరిత్ర ఇప్పటిది కాదు.. దాదాపుగా వందేళ్ల చరిత్ర ఉంది. మామనూరు ఎయిర్‌పోర్ట్‌ను 1930లో అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రారంభించారు. అయితే 1981 వరకు అంటే దాదాపు 50 సంవత్సరాల పాటు మామునూరు ఎయిర్‌పోర్ట్ నుంచి విమాన రాకపోకలు సాగాయి. అప్పట్లో వరంగల్ పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందడంతో దాని అవసరాలకు అనుగుణంగా మామనూరు ఎయిర్‌పోర్ట్‌ను వినియోగించారు. మామనూరు ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదన మళ్లీ 2020లో తెరపైకొచ్చింది. అప్పటి ప్రభుత్వం కేంద్రమంత్రిని కలిసి ఎయిర్‌పోర్ట్‌ను మంజూరు చేయాలని కోరారు. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందని ప్రతిపాదన చేశారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆరు ప్రాంతాల్లో ఎయిర్‌పోర్ట్‌లకు అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపింది. అందులో వరంగల్, ఆదిలాబాద్, జక్రాన్‌పల్లిలో ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణానికి టెక్నికల్‌గా సాధ్యమవుతుందని కేంద్రం నివేదిక ఇచ్చింది. 2023 జూలై 31న రాష్ట్ర మంత్రివర్గం మామునూరు కొత్త ఎయిర్‌పోర్ట్‌కు ఆమోదముద్ర వేసింది. కాగా, ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా వరంగల్ ఎయిర్‌పోర్టు నుంచి ఫైట్ సర్వీసులు మొదలు పెట్టేలా చర్యలు చేపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి