Telangana: హోటల్‌ను శాశ్వతంగా మూయిస్తా.. మజ్లీస్ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్.. ఎందుకో తెలుసా?

| Edited By: Balaraju Goud

Aug 22, 2024 | 12:13 PM

టోలిచౌకి చౌరస్తాలో స్థానికంగా ఉన్న ఓ హోటల్ నుంచి బిర్యానీ వ్యర్థ పదార్థాలు, కూరగాయల చెత్తను మూటలుగా కట్టి ఆ మార్గంలో ఉన్న పైప్ లైన్ లోనే వేస్తూ ఉండడంతో ఆ ప్రాంతంలో నీరు నిలిచిపోతుందని అధికారులు గుర్తించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువవుతోంది.

Telangana: హోటల్‌ను శాశ్వతంగా మూయిస్తా.. మజ్లీస్ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్.. ఎందుకో తెలుసా?
Majlis Mla Kausar Mohiuddin
Follow us on

గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అది హైదరాబాద్ మహానగరంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నగరం నలుమూలల ఇదే పరిస్థితి. కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కురిసిన వర్షపు నీరు ఎక్కడిక్కడ నిలిచి ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. రోడ్లపై వాహనాలే కాదు.. పడవలు నడపాలన్నంత అస్తవ్యస్తంగా మారుతుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ పరిస్థితి నగరంలోని చాలా ప్రాంతాలతోపాటు పాతబస్తీ టోలిచౌకి చౌరస్తాలో కూడా ఏర్పడుతుంది. ఈ ఏరియాలో ఎప్పుడు చిన్నపాటి వర్షం కురిసినా మొత్తం చౌరస్తాలో నీరు నిలిచిపోతుంది.

జనజీవనం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో భారీ వర్షం కురిసినప్పుడు తలెత్తే సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకకపోవడంతో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు తలకు మించిన భారంగా తయారవుతోంది. కోట్లు ఖర్చు పెట్టి మరీ సౌకర్యాలు సమకూరుస్తున్నప్పటికీ ఇలాంటి పరిస్థితులే ఎదురవతున్నాయి. సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం దొరకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. నగరంలోని ఉన్నతస్థాయి ఇంజనీర్ల ద్వారా టోలిచౌకి చౌరస్తాలో ఉన్న సమస్యకి పరిష్కారం కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఇక్కడ ఎలాంటి సమస్యలు లేవని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే ఆకస్మీక తనిఖీ చేశారు.

టోలిచౌకి చౌరస్తాలో స్థానికంగా ఉన్న ఓ హోటల్ నుంచి బిర్యానీ వ్యర్థ పదార్థాలు, కూరగాయల చెత్తను మూటలుగా కట్టి ఆ మార్గంలో ఉన్న పైప్ లైన్ లోనే వేస్తూ ఉండడంతో ఆ ప్రాంతంలో నీరు నిలిచిపోతుందని అధికారులు గుర్తించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువవుతోంది. ఈ సమస్యపై స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకున్న అధికారులు పరిష్కారానికి చర్యలు చేపట్టారు. దీంతో ఇది చివరికి స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ దృష్టికి చేరింది. హోటల్ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు పైపు లైనులో వేస్తుండడంతోనే సమస్య ఉత్పన్నమవుతుందని తెలుసుకున్నారు ఎమ్మెల్యే. వెంటనే హోటల్ యజమానులకు వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించేదీ లేదని హెచ్చరించారు.

వీడియో చూడండి…

ఇంకోసారి ఇలా చెత్త నాలాల్లో వేస్తే హోటల్‌ను శాశ్వతంగా మూసివేయిస్తానని బహిరంగంగానే హెచ్చరించారు. అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించి.. హోటల్ యాజమాన్యంతో నేరుగా మాట్లాడారు. ఇంకోసారి ఇలాగే సమస్యలను సృష్టించేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి వల్ల ఎంతో మంది స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇకపై వ్యర్థాలను నాలా పైపు లైనులో వేయరాదని, మరోసారి ఇలాంటి సమస్యలు ఎదురవకుండా చూసుకుంటానని ప్రజలకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..