
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోట శాసనమండలి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితం రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. మెజారిటీ ఓటర్ల బలం ప్రతిపక్ష బీఆర్ఎస్ కే ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో నిలపడంతో పోరు రసవత్తరంగా సాగింది. ఈ ఉపఎన్నికలో పోటీకి బీజేపీ దూరంగా ఉంది. నియోజకవర్గం పరిధిలో మొత్తం 1,439 మంది ఓటర్లుండగా 1,437 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిథిలోని ఇద్దరు ఎంపీటీసీలు మినహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెట్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కౌంటింగ్‌ను ఈసీ ఇవాళ్టికి వాయిదా వేసింది.
నువ్వా నేనా అన్నట్లు సాగిన ఎన్నిక ఫలితం ఎవరికి అనుకూలంగా వస్తుందో అన్నదీ ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఏప్రిల్ 2వ తేదీనే ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉన్న చివరి నిమిషంలో వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ ఫలితాల ప్రభావం వాటిపై పడే అవకాశం ఉందని కౌంటింగ్ ను జూన్ 2వ తేదీకి మార్చారు. దీంతో అనుకున్న సమయానికంటే ఊహించని రీతిలో ఫలితం కోసం అభ్యర్థులు వేచి చూస్తున్నారు.
ఇక జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కాలేజ్ లో రేపు ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. మొత్తం 5 టేబుల్స్ లో ఏర్పాటు చేసి ఓట్లను లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్చి 28న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది పోలింగ్ కేంద్రాలలో మొత్తం 1,439 మంది స్థానిక సంస్థల ఓటర్లుండగా… అందులో 1,437 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 99.86 శాతం పోలింగ్ నమోదైంది.
కౌంటింగ్ కోసం 5 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ముందుగా 10 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను రెండు రౌండ్లలో లెక్కిస్తారు. ఆ తర్వాత చెల్లుబాటు కాని ఓట్లను వేరుచేస్తారు. చెల్లుబాటయ్యే ఓట్ల ఆధారంగా కోటా నిర్ణయిస్తారు. అనంతరం మొదేటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఏ అభ్యర్ధికైనా మొదటి ప్రాధాన్యత ఓటులో కోటా కన్నా ఒక్క ఓటు అధికంగా వచ్చినా వారినే విజేతగా ప్రకటిస్తారు. ఏ అభ్యర్థికీ కోటాకు కావలసిన ఓట్లు రానట్లయితే ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి తదుపరి ప్రాధాన్యత క్రమం ఆధారంగా ఓట్ల లెక్కింపు చేపడతారు. ఏ అభ్యర్థికీ కోటా రానట్లయితే చివరికి మిగిలిన అభ్యర్థి గెలుపొందినట్లుగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యతలోనే మెజారిటీ మార్క్ చేరితే మధ్యాహ్నం లోపు ఫలితం వెల్లడి కానుంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేస్తే ఫలితం సాయింత్రం వరకు సమయం పట్టే అవకాశం ఉంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కు కీలకంగా మారిన ఎన్నిక
ఇక షెడ్యుల్ వెలువడినప్పటి నుంచి ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ కే మెజారిటీ ఉంది. అయినప్పటికీ రాష్ట్రంలో అధికార మార్పిడి, ఇతర కారణాలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపింది. దీంతో రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోరు సాగించాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహాన్ని అమలు చేస్తే, గోవా క్యాంప్ పేరుతో బీఆర్ఎస్ ప్రతివ్యూహాన్ని అమలు చేసింది. అయితే రెండు పార్టీల అభ్యర్థులు గెలుపుపై ధీమాగా ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ అంశం కలవరపెడుతోంది. బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ కు.. బీజేపీ ఓట్లు బీఆర్ఎస్ కు పడినట్లు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు.
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు పోలీసు శాఖ భారీ బందోబస్తు చేపట్టింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ పర్యవేక్షణలో పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 275 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు కేంద్రంలో, పరిసరాల్లో, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఎన్నిక, సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది..!
మరన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…