రికార్డు సృష్టించిన పాలమూరు ప్రభుత్వ వైద్యులు.. ఒక్కరోజే జన్మించిన 42మంది శిశువులు!

| Edited By: Balaraju Goud

Sep 24, 2024 | 11:24 AM

ప్రభుత్వ ఆసుప్రతిలో ప్రసవాల సంఖ్య సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. 24గంటల్లో 41కాన్పులు చేసి పాలమూరు ప్రభుత్వ వైద్యులు రికార్డు సృష్టించారు.

రికార్డు సృష్టించిన పాలమూరు ప్రభుత్వ వైద్యులు.. ఒక్కరోజే జన్మించిన 42మంది శిశువులు!
Mahabubnagar District Government Hospital
Follow us on

ప్రభుత్వ ఆసుప్రతిలో ప్రసవాల సంఖ్య సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. 24గంటల్లో 41కాన్పులు చేసి పాలమూరు ప్రభుత్వ వైద్యులు రికార్డు సృష్టించారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ అస్పత్రిలో ఒక్కరోజులో పెద్ద మొత్తంలో డెలివరీలు నిర్వహించారు వైద్యులు. సెప్టెంబర్ 19వ తేదీన ఒక్కరోజే 41 కాన్పులు చేసి మతాశిశు విభాగ వైద్యులు రికార్డు సృష్టించారు. ఈ కాన్పుల్లో 42మంది శిశువులు జిల్లా అస్పత్రిలో ఒక్కరోజే జన్మించారు. ఒక మహిళ కవలలకు జన్మనివ్వడం విశేషం. మొత్తం కాన్పుల్లో 16మంది మగ, 26మంది ఆడ శిశువులు ఉన్నారు. మొత్తం 10మంది వైద్యులు నిర్వహించిన 41 కాన్పుల్లో 10 నార్మల్ కాగా, 31 సీజేరియన్ డెలివరీలు అయ్యాయి. గతంలో ఇదే ఆసుపత్రిలో ఒకే రోజు 43 కాన్పులు చేసి ఔరా అనిపించారు.

సాధారణంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అస్పత్రిలో మతాశిశు విభాగానికి మహిళలు పెద్ద ఎత్తున ప్రసవానికి వస్తున్నారు. ప్రతిరోజు సుమారు 600 నుంచి 800మంది వరకు గర్భిణిలు ఓపీ కోసం వస్తుంటారు. ప్రైవేటు అస్పత్రులకు ధీటుగా ఈ విభాగం ప్రతిరోజూ కిటకిటలాడుతోంది. అలాగే ప్రతిరోజూ దాదాపు 30నుంచి 35 వరకు కాన్పులు నిర్వహిస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో ఈ డెలివరీల సంఖ్యను పెంచే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా ఎంత మంది వచ్చినా చికిత్స విషయంలో రాజీ ఉండదంటున్నాయి జిల్లా ఆస్పత్రి వర్గాలు.

ఇక, పెద్ద ఎత్తున డెలివరీలు నిర్వహించిన మతాశిశు విభాగాన్ని సూపరింటెండెంట్ సంపత్ కుమార్ సింగ్ అభినందించారు. డెలివరీలు అన్నీ కూడా హైరిస్క్ కేసులేనని, వైద్యులు ఎంతో జాగ్రత్తగా కాన్పులు చేశారని ఆయన చెప్పారు. ప్రజల ఆరోగ్యం కోసం ఎంతో శ్రమిస్తున్న వైద్యుల సేవలు అభినందనీయమని చెప్పారు. ఇక రికార్డు స్థాయిలో కాన్పులు నిర్వహించడంతో అటు పేషంట్లు, వారి బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..