AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Update: తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..

బంగాళాఖాతంలో మరో అల్పపీడన ముప్పు పొంచివుంది.. రాగల 3 నుండి 4 రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Weather Update: తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
Heavy Rains In Ap And Telangana
Krishna S
|

Updated on: Sep 17, 2026 | 2:36 PM

Share

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు, నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారలు వెల్లడించారు. ఉత్తర థాయిలాండ్ పరిసరాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సెప్టెంబర్ 18 సాయంత్రానికి ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనుంది. దీని ప్రభావంతో సెప్టెంబర్ 19 నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింత బలపడి రాబోయే 3-4 రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా – ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు దూసుకువచ్చే అవకాశం ఉంది. మరోవైపు రుతుపవన ద్రోణి ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉండటంతో పాటు, మరాఠ్వాడా నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు మరో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.

ఏపీలోని 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పలు జిల్లాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 40 నుండి 60 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు: అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

తేలికపాటి వర్షాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో పాటు తేలికపాటి జల్లులు కురిసే సూచనలున్నాయి.

తెలంగాణలో వర్ష సూచన

రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షం కురిసే సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు, ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పిడుగుపాటు ముప్పు ఎక్కువగా ఉన్నందున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల వద్ద ఆశ్రయం పొందవద్దు. వ్యవసాయ పనుల్లో ఉండే రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

Follow Us