AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాజువాకలో 89 అడుగుల గణపతి మండప వివాదం

గాజువాక శ్రీనగర్‌లో ఎస్వీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఏర్పాటు చేసిన 89 అడుగుల మహాగణపతి మండపం చుట్టూ వివాదం ముదురుతోంది. అనుమతులు లేకుండా వాణిజ్య స్టాళ్లు, వినోద ఏర్పాట్లు, భారీ తాత్కాలిక సెట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. ట్రాఫిక్‌కు అంతరాయం, భద్రతా నిబంధనల ఉల్లంఘనపై అధికారులు తీవ్రంగా స్పందించి..

గాజువాకలో 89 అడుగుల గణపతి మండప వివాదం
Gajuwaka Ganesh Mandapam
Ram Naramaneni
|

Updated on: Sep 17, 2026 | 2:05 PM

Share

— ఓవైపు భక్తి పరవశం.. మరోవైపు కాసుల వర్షం! వినాయక మండపమా.. లేక వ్యాపార సముదాయమా? భక్తికి ప్రతీకగా నిలవాల్సిన గాజువాక వినాయక మండపం వివాదాలకు కేంద్రబిందువైంది. శ్రీనగర్‌లో ఎస్వీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఏర్పాటు చేసిన 89 అడుగుల మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తుతుంటే.. దేవుని పేరుతో అనుమతులు తీసుకుని, మండపం నీడలో భారీ ఎత్తున వాణిజ్య స్టాళ్లు, అమ్యూజ్‌మెంట్‌లు ఏర్పాటు చేసి రూ.కోట్లు దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ట్రాఫిక్‌ను అడ్డుకుంటూ, భద్రతా నిబంధనలను గాలికి వదిలేసి సాగిస్తున్న ఈ దందాపై అధికారులు ఎట్టకేలకు సీరియస్ అయ్యారు. “మీరు తీస్తారా.. లేక మేమే కూల్చేయమంటారా?” అంటూ నిర్వాహకులకు అల్టిమేటం జారీ చేశారు.

— గాజువాక శ్రీనగర్‌లో ఎస్వీ ఎంటర్టైన్మెంట్స్ ఏర్పాటు చేసిన 89 అడుగుల మహాగణపతి మండపం దగ్గర వివాదం ముదురుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా భారీ సెట్లు, తాత్కాలిక వాణిజ్య స్టాల్స్, అమ్యూజ్‌మెంట్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. భక్తి ముసుగులో జీవీఎంసీ గానీ, ఇతర శాఖల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా కమర్షియల్ స్టాళ్లు, అమ్యూజ్‌మెంట్స్, యమలోకం, డైనో పార్క్ వంటి ఆకర్షణలు నిర్వహిస్తున్నట్లు అధికారులు పరిశీలనలో కనుగొన్నారు.

— మండపం దగ్గర కమర్షియల్ కార్యకలాపాలు నిర్వహించవద్దని, హైవే సర్వీస్ రోడ్లపై పార్కింగ్‌తో ప్రజలకు, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ స్పష్టం చేసినా నిర్వాహకులు పట్టించుకోలేదు. జనాలు తరలిరావడం, తగిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన అధికారులు.. అనధికార స్టాల్స్, కమర్షియల్ సెట్టింగ్‌లను మాత్రమే తక్షణమే తొలగించాలని ఆదేశించారు.

— అధికారుల హెచ్చరికలను నిర్వాహకులు బేఖాతరు చేస్తుండటం.. పోలీసులు, GVMC అధికారులు ఇచ్చిన ముందస్తు నోటీసులను ఎస్వీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్వాహకులు లెక్కచేయకపోవడంతో కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. స్వచ్ఛందంగా స్టాల్స్‌ను తొలగించకపోతే, ఇవాళే రంగంలోకి దిగి అనధికార నిర్మాణాలు, ఎంటర్‌టైన్‌మెంట్ సెట్టింగ్‌లను తొలగిస్తామని… ఆ ఖర్చును కూడా నిర్వాహకుల నుంచే వసూలు చేస్తామని మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు.

Follow Us