Indian Railways: రైళ్లల్లో వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం.. ఏసీ కోచుల్లో జీవితాంతం ఫ్రీ.. నవంబర్ 1 నుంచే అమల్లోకి..
రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జవాన్లను గౌరవించేందుకు రైళ్లల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం పురస్కార గ్రహీతలకు మాత్రమే ఈ సదుపాయం అమల్లో ఉంటుంది. ఎవరెవరికి ఇది అందుబాటులో ఉంటుంది..? ఎలా పొందాలి? అనేది చూద్దాం.

జవాన్లను గౌరవించేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లకు గౌరవార్థంగా సూపర్ గిఫ్ట్ ప్రకటించింది. వీర పురస్కార గ్రహీతలకు రైల్వే ఏసీ కోచ్‌లలో ఉచిత ప్రయాణ సౌకర్యం అందించనున్నారు. వారికి జీవితాంతం ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. సైనికులతో పాటు వారి కుటుంబాలకు కూడా ఉచిత జర్నీ వర్తిస్తుంది. సేవా పతక్, నౌసేనా పతక్, వాయుసేనా పతక్ వంటి పురస్కారాలు అందుకున్న సైనికులకు ఈ బెనిఫిట్ ఉంటుంది. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. పూర్తిగా డిజిటల్ విధానంలో దీనిని అమలు చేయనున్నారు. ఆన్‌లైన్‌లోనే టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం కల్పించనున్నారు.
ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ టూ టైర్, ఏసీ చైర్ కార్ కోచుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉపయోగించుకోవచ్చు. పురస్కార గ్రహీతలతో పాటు వారి జీవిత భాగస్వామికి ఇది వర్తిస్తుంది. జీవితాంతం రైళ్లల్లో ఉచిత జర్నీ చేయవచ్చు. పురస్కార గ్రహీత మరణించి.. జీవిత భాగస్వామి జీవించి ఉంటే ఆమె రెండో పెళ్లి చేసుకునేవరకు ఉచిత సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇక పురస్కార గ్రహీతకు పెళ్లికాని పక్షంలో.. అతడు మరణిస్తే తల్లిదండ్రులకు ఇది వర్తిస్తుంది. దీనిని అమలు చేసేందుకు పేపర్ లెస్ విధానం పాటించనున్నారు. దీని కోసం జవాన్లు ఎలాంటి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. రైల్వే కన్సెషనల్ కార్డ్ పోర్టల్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ధృవీకరణ ఉంటుంది. ఆ తర్వాత అర్హులకు ఆన్ లైన్ ఎలక్ట్రానిక్ ట్రావెల్ పాస్ జారీ చేస్తారు. దీని ద్వారా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
ట్రావెల్ పాస్ ఆధారంగా లబ్దిదారులు ఈజీగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లోకి వెళ్లి సులభంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ పాస్ ఉన్నవారికి బుకింగ్స్ మొదలుపెట్టనున్నారు. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్లో ఆప్షన్ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం పోర్టల్‌లో ఈ మార్పులు చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి పోరాడిన సైనికులను గౌరవించడం కోసం రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విధుల్లో ఉన్న సైనికులతో పాటు రిటైర్డ్ జవాన్లకు కూడా ఇది వర్తిస్తుంది. ఇక నేటి యువతకు కూడా దేశ భక్తి భావనను నింపడానికి కూడా సహాయపడుతుంది. పురస్కార గ్రహీతలందరూ ఈ అవకాశం ఉపయోగించుకోవాలని రైల్వేశాఖ సూచించింది. నవంబర్ 1వ తేద నుంచి ఉపయోగించుకోవచ్చని సూచించింది.
