Lok Sabha Election: తెలంగాణలో కామ్రేడ్ల కొత్త ప్లాన్.. లోక్ సభకు లైన్ క్లియర్ అవుతుందా..?

| Edited By: Balaraju Goud

Jan 03, 2024 | 1:35 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నయా సర్కార్ పాలన పట్టాలెక్కింది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఇక పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. మెయిన్ పార్టీలతో కలిసి వెళ్లేందుకు చిన్న పార్టీలు సైతం పావులు కదుపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ‌తో కలిసిన వెళ్లిన కామ్రేడ్లు, లోక్ సభ బరిలోనూ అదే అవగాహనతో వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాయి. ఒక్క ఎంపీ సీటు ఇవ్వండి.. మళ్లీ ఇరగదీద్దాం అంటూ సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

Lok Sabha Election: తెలంగాణలో కామ్రేడ్ల కొత్త ప్లాన్.. లోక్ సభకు లైన్ క్లియర్ అవుతుందా..?
Congress Cpi
Follow us on

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నయా సర్కార్ పాలన పట్టాలెక్కింది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఇక పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. మెయిన్ పార్టీలతో కలిసి వెళ్లేందుకు చిన్న పార్టీలు సైతం పావులు కదుపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ‌తో కలిసిన వెళ్లిన కామ్రేడ్లు, లోక్ సభ బరిలోనూ అదే అవగాహనతో వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాయి. ఒక్క ఎంపీ సీటు ఇవ్వండి.. మళ్లీ ఇరగదీద్దాం అంటూ సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇంతకీ ఎర్రసైన్యం ఏ సీటు అడుగుతోంది.? కాంగ్రెస్ పార్టీతో కలిసి అసెంబ్లీ మాదిరి పార్లమెంట్ లోనూ ఓ పాదం మోపుతారా..?

కలిసివచ్చిన కాలాన్ని అంది పుచ్చుకోవాలన్న చందంగా కామ్రేడ్లు కదం తొక్కుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా ఒక స్థానంలో పోటీ చేసిన సీపీఐ భారీ విజయం సాధించింది. దీంతో అదే ఊపులో, అదే పొత్తుతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని సీపీఐ నేతలు భావిస్తున్నారు. అన్ని పార్టీలు లోక్ సభ ఎన్నికలపై సమాయత్తం అవుతున్న వేళ కామ్రేడ్లు కూడా పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్న సీపీఐ తెలంగాణలో అదే పంథా కొనసాగిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి వెళ్లినట్లు పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణలో పొత్తుతో పోటీ చేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారట.

ఇందులో భాగంగానే లోక్ సభ ఎలక్షన్స్‌లోనూ కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని అనుకుంటున్నామని గతంలోనే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు. అదే అంశాన్ని సిపీఐ నేతలంతా కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిసి చెప్పారట. శాసన సభలో సీపీఐ కాంగ్రెస్ పొత్తు సత్ఫలితాలు ఇచ్చినందున.. లోక్ సభ ఎన్నికల్లో అదే అవగాహనతో పోటీ చేసి పరస్పరం సహకరించుకుందామని సీపీఐ నేతల బృందం రేవంత్ రెడ్డిని కోరింది. కామ్రేడ్ల పట్టున్న ఖమ్మం, నల్గొండ స్థానాల్లో ఏదో ఒక్కటి ఇస్తే చాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తమ పార్టీ అధిష్టానమే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక సీపీఐ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో తమ ప్రాబల్యాన్ని చాటింది. దీంతో ఆయా జిల్లాలోనే లోక్ సభ స్థానాల్లో తమకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ అవగాహనతో గెలిచి తీరుతామని కామ్రేడ్లు చెబుతున్నారు. ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి గతంలో పోటీ చేసిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆ సీటును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం లోక్ సభ స్థానం సీపీఐకి కేటాయించి గెలిచేందుకు సహకరించాలని కాంగ్రెస్ కు సీపీఐ నేతల బృందం విన్నవించింది. అది కుదరకపోతే నల్గొండ స్థానం అయిన ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. 2014లో ఖమ్మం నుంచి పోటి చేసి ఓడిపోయిన నారాయణ.. కాంగ్- కమ్యూనిస్టుల పొత్తుతో ఈసారి గట్టెక్కొచ్చని భావిస్తున్నారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్యే, రెండు ఎమ్మెల్సీ స్థానాల అవగాహన కాంగ్రెస్ – సీపీఐ మధ్య కుదిరింది. ఇప్పడు రెండు ఎమ్మెల్సీ స్థానాలను కేటాయించడంతో పాటు లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామంటూ కాంగ్రెస్ ముందు కమ్యూనిస్టులు ప్రతిపాదన ఉంచారు. కాంగ్రెస్ అధిష్థానం మరి సీపీఐకి కఒక్క లోక్ సభ స్థానం రాష్ట్రంలో కేటాయిస్తోందో లేదో వేచి చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…