హస్తినలో కాంగ్రెస్ ఆశావహులు.. అధిష్టానం పెద్దల చుట్టూ ప్రదక్షిణలు.. టికెట్ దొరికేనా?

| Edited By: Ram Naramaneni

Oct 08, 2023 | 4:08 PM

రాష్ట్ర జనాభాలో 50 శాతం కంటే ఎక్కువగా బీసీలకు తగినంత ప్రాధాన్యత, ప్రాతినిథ్యం లేకపోతే బీసీ ఓట్లు కాంగ్రెస్‌కు ఎలా వస్తాయని బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) చేసిన తీర్మానం ప్రకారం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 2 బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ లెక్కన మొత్తం 34 సీట్లు ఇవ్వాలని కోరుతున్నారు.

హస్తినలో కాంగ్రెస్ ఆశావహులు.. అధిష్టానం పెద్దల చుట్టూ ప్రదక్షిణలు.. టికెట్ దొరికేనా?
Rahul Gandhi - Mallikarjun Kharge - KC Venugopal
Follow us on

టికెట్ వస్తే చాలు.. సగం గెలిచినట్టే. అందుకోసం ఎంతకైనా తెగిద్దాం. ఇదీ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ఆశావాహుల్లో నెలకొన్న భావన. టికెట్ల కోసం దరఖాస్తు చేసుకుని చేతులు దులుపుకోలేదు. ఎవరికివారుగా తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొందరు సామాజిక సమీకరణాలను తెరపైకి తెస్తుంటే, మరికొందరు పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి చేసిన పనిని గుర్తుచేస్తున్నారు. మొత్తంగా కులాలు, వర్గాలు, సంఘాల వారిగా టికెట్లు డిమాండ్ చేస్తూ హస్తినలో మంతనాలు సాగిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ప్రసన్నం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. టికెట్లు డిమాండ్లు చేస్తున్నవారిలో ఎవరెవరు ఎన్ని సీట్లు డిమాండ్లు చేస్తున్నారో చూద్దాం..

మహిళలకు కనీసం 25 సీట్లు కావాలి

గత నెలలో కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంటులో ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా మహిళలకు సీట్ల కేటాయింపు పెంచాలన్న డిమాండ్ అన్ని పార్టీల్లోనూ పెరిగింది. ఇప్పటికిప్పుడు ఆ బిల్లు అమల్లోకి రాకపోయినా.. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ క్రమంలో తమకు కనీసం 25 సీట్లు కేటాయించాలని తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు డిమాండ్ చేస్తున్నారు. బిల్లులో పొందుపర్చిన ప్రకారం 33 శాతం డిమాండ్ చేయడం లేదని, ఆ లెక్కన చూస్తే 119 నియోజకవర్గాలకు కనీసం 40 సీట్లు మహిళలకు కేటాయించాల్సి వస్తుందని ఆమె అంటున్నారు. గత ఎన్నికల్లో మహిళలకు 11 సీట్లు మాత్రమే కేటాయించారని, ఈ సారి ఆ సంఖ్యను 20-25 సీట్లకు పెంచాలని కోరుతున్నారు. అందులో 20 సీట్లు మహిళా కాంగ్రెస్ నేతలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో గెలవలేని సీట్లను మహిళలకు కేటాయించి, ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు వ్యవహరించరాదని కూడా కోరుతున్నారు. మహిళలు ప్రచారం చేయడానికి సైతం వీలుపడని గోషామహల్ సీటును తనకు కేటాయించినట్టు తెలిసిందని, తాను ఖైరతాబాద్ కోసం దరఖాస్తు చేసుకున్నానని, అది కుదరనిపక్షంలో సికింద్రాబాద్ లేదా అంబర్‌పేటలో ఏదో ఒకటి ఇవ్వాలని కోరుతున్నానని ఆమె తెలిపారు. తనను కేవలం మహిళా కోటాలోనే కాదు, రాష్ట్రంలో అత్యధిక జనాభా కల్గిన ‘ముదిరాజ్’ సామాజికవర్గం కోణంలోనూ తనను పరిశీలించాలని అధిష్టానం పెద్దలకు చెబుతున్నారు.

యూత్ కాంగ్రెస్‌కి 5 టికెట్లు

గత ఎన్నికల్లో ఓడిపోయిన మరుక్షణం నుంచే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్నది యూత్ కాంగ్రెస్ ఒక్కటేనని, కేసులను సైతం ఎదుర్కొంటూ పార్టీ కోసం కష్టపడ్డ తమకు కనీసం 5 సీట్లైనా కేటాయించాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. వారి డిమాండ్‌కు సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మద్దతిస్తున్నారు. అంతేకాదు, వారికోసం ఆయన అధిష్టానం పెద్దలతో మంతనాలు కూడా సాగిస్తున్నారు. ఇక యూత్ కాంగ్రెస్ తెలంగాణ విభాగం అధ్యక్షులు శివసేనా రెడ్డి మాట్లాడుతూ.. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం యువతకు, మహిళలకు, ప్రాతినిధ్యం పెద్దగా లేని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని.. అందులో భాగంగానే తాము 5 టికెట్లు యూత్ కాంగ్రెస్ నుంచి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అలాగే మిగతా సీట్లలోనూ యువ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నట్టు చెప్పారు. ప్రజలు కొత్త ముఖాలను కోరుకుంటున్నారని చెప్పారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టినప్పుడు 40 మంది యూత్ కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇచ్చారని, అప్పుడు ఓడిపోయినా.. 1989లో మళ్లీ రెండోసారి టికెట్లు ఇస్తే 40 మంది గెలిచారని గుర్తుచేశారు. సర్వేలు ప్రామాణికం కాదని, నామినేషన్ వేసే ముందు బీ-ఫాం తీసుకున్నవాళ్లు సైతం గెలిచిన ఉదంతాలున్నాయని అన్నారు.

34 సీట్లు కోరుతున్న బీసీ నేతలు

రాష్ట్ర జనాభాలో 50 శాతం కంటే ఎక్కువగా బీసీలకు తగినంత ప్రాధాన్యత, ప్రాతినిథ్యం లేకపోతే బీసీ ఓట్లు కాంగ్రెస్‌కు ఎలా వస్తాయని బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) చేసిన తీర్మానం ప్రకారం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 2 బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ లెక్కన మొత్తం 34 సీట్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే డిమాండ్‌ను నేరుగా అధిష్టానం పెద్దలను కలిసి చెప్పాలన్న ఉద్దేశంతో బీసీ నేతలంతా కలిసి హస్తినబాట పట్టినప్పటికీ.. పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో వారం పది రోజులు నిరీక్షించి వెనుదిరిగారు. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆవేదన, అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ కళ్ల ముందే ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే నేతల కోసం క్షణాల్లో అపాయింట్మెంట్లు ఖరారు చేసిన అధిష్టానం పెద్దలు, తమకు నిరాకరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ సగం సీట్లను మించి గెలవలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో సైతం తెలంగాణలో సగం సీట్లను మించి రాలేదని గుర్తుచేస్తున్నారు. ఇందుక్కారణం బీసీ ఓటర్లు కాంగ్రెస్‌కు దూరం కావడమేనని, ఇప్పటికైనా అధిష్టానం మేల్కొనకపోతే ఉపయోగం ఉండదని అంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కథ ముగిసిందని, బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తే బీసీ ఓటర్లు వెనక్కి తిరిగొచ్చే అవకాశం ఉందని బీసీ నేతలు సూత్రీకరిస్తున్నారు.

బీసీల్లో కులాలవారిగా టికెట్ల డిమాండ్ కూడా పెరుగుతోంది. అత్యధిక జనాభా కల్గిన ముదిరాజ్ సామాజికవర్గం కనీసం 5-6 సీట్లు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. వారితో పాటు పెరిక, గౌడ, యాదవ, మున్నూరు కాపు, పద్మశాలి సామాజికవర్గాలు తమ జనాభా సంఖ్య అనుసరించి లేదంటే తమ జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో టికెట్లు తమవారికి కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు.

10 సీట్లు కోరుతున్న ‘కమ్మ’ ఐక్య వేదిక

సినిమా, మీడియా, పారిశ్రామిక రంగాలతో పాటు వివిధ రంగాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న ‘కమ్మ’ సామాజికవర్గం సైతం తమకు కనీసం 10 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తోంది. ‘తెలంగాణ కమ్మవారి రాజకీయ ఐక్య వేదిక’ పేరుతో గత కొద్ది రోజుల నుంచి ఢిల్లీలో ఆ వర్గం నేతలు మంతనాలు సాగిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కల్గిన రేణుక చౌదరి నేతృత్వంలో ‘కమ్మ’ వర్గం నేతలు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ కే. మురళీధరన్‌ను వరుసగా కలిశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ తమ వర్గానికి ప్రాతినిథ్యం కల్పించడం లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత తెలంగాణలో పరిస్థితులు మారాయని, ‘కమ్మ’ వర్గం ఓటర్లు ‘బీఆర్ఎస్’కు దూరమై కాంగ్రెస్‌కు దగ్గరయ్యారని సూత్రీకరిస్తున్నారు. రిజర్వుడు నియోజకవర్గాల్లో సైతం రాజకీయంగా పలుకుబడి తమకు ఉందని, మొత్తం రాష్ట్రంలో 30-40 నియోజకవర్గాల్లో ప్రభావవంతంగా ఉన్నామని వెల్లడిస్తున్నారు. 2019 తర్వాత రాష్ట్రంలోకి వలసలు పెరిగి తమ వర్గం ఓటర్ల సంఖ్య కూడా పెరిగిందని వారంటున్నారు. మొత్తంగా సుమారు 6 శాతం ఓటర్లు తమ వర్గం నుంచి ఉన్నారని చెబుతున్నారు.

టికెట్ల వేటలో ఎన్ఆర్ఐలు

కాంగ్రెస్ టికెట్ల కోసం కులాలు, వర్గాలు, సంఘాలవారిగా డిమాండ్ చేస్తున్నవారు ఓవైపు ఉండగా.. మరోవైపు ఎన్ఆర్ఐలు సైతం టికెట్లు ఆశిస్తూ ప్రయత్నాలు సాగిస్తున్నారు. వారిలో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ‘పాలకుర్తి’ నియోజకవర్గంలో టికెట్ కోసం పోటీపడుతున్న ఇద్దరూ ఎన్ఆర్ఐలు కావడం విశేషం. వారిలో ఒకరు ఝాన్సి రెడ్డి కాగా మరొకరు యెర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఇద్దరిలో ఝాన్సీ రెడ్డి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటికీ ఇంకా ఆమెకు దక్కలేదని సమాచారం. భారత పౌరసత్వం లేకుండా ఇక్కడి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆస్కారం ఉండదన్న విషయం తెలిసిందే. అందుకే తనకు దక్కకుండా తన కోడలు మామిడాల యశశ్వినికి టికెట్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. వరంగల్ ఎన్ఐటీ నుంచి కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పొంది, అమెరికాలో కొన్నాళ్లు నివసించి తిరిగొచ్చి తిరుపతి రెడ్డి ఈ స్థానం నుంచి తనకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అమెరికాలో ఉన్నప్పుడు సైతం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్‌లో చురుగ్గా వ్యవహరించి సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశానని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నానని, పార్టీ కోసం నిబద్ధతతో ఉన్న తనలాంటివారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

ఓయూ జేఏసీ నేతలకు చోటేది?

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసి ఉద్యమించిన ఓయూ జేఏసీ విద్యార్థులకు చోటేదని నాటి విద్యార్థి సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న కాంగ్రెస్ వార్ రూమ్ ఎదుట మానవతా రాయ్ నేతృత్వంలో ఓయూ జేఏసీ నేతలు ఏకంగా ధర్నా చేపట్టి మరీ డిమాండ్ చేస్తున్నారు. హీనపక్షంలో తమకు కనీసం 5 సీట్లైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. యువతకు ప్రాధాన్యతనివ్వాలన్న రాహుల్ గాంధీ సూచనలను స్క్రీనింగ్ కమిటీ పరిగణలోకి తీసుకుని తమకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం ప్రకారమే రిజర్వుడు నియోజకవర్గాలు ఉన్నప్పటికీ.. వాటిలోనూ తీవ్రమైన పోటీ నెలకొంది. తమకు అనుకూలంగా ఉండే నేతలకు టికెట్లు ఇప్పించుకోవాలన్న ప్రయత్నాల్లో టీపీసీసీ సీనియర్ నేతలు ఎవరికివారు ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలు రిజర్వుడు స్థానాల్లోనూ తమ పట్టు నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. మొత్తంగా ఇన్ని డిమాండ్ల మధ్య అందరికీ తగిన చోటు కల్పిస్తూ అభ్యర్థులను ఎంపిక చేయడం కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..