Koushik Reddy meet KTR: హుజూరాబాద్ కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డి.. ఇటీవల మంత్రి కేటీఆర్‌తో భేటీ కావడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ వర్గాల్లో భిన్నమైన ఆలోచనలు, ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేకాకుండా కౌశిక్ రెడ్డి.. కేటీఆర్ ఆహ్వానించారని.. ఆయన గులాబీ పార్టీలోకి చేరుతారంటూ పలు ఊహగానాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో దీనిపై స్వయంగా కౌశిక్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్ తనను ఆహ్వానించిందనటం అవాస్తవమని హుజూరాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డి స్పష్టంచేశారు. టీఆర్ఎస్ లోకి వెళ్లనని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల్లో హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నుంచే పోటీ చేశానని, ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు. కేటీఆర్‌ను కలిసినంత మాత్రానా.. వారి పార్టీలోకి వెళ్లనని పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌దే విజయమని కేటీఆర్‌తోనూ చెప్పానని ఆయన అన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని ఆశిస్తున్నట్టు కౌశిక్‌రెడ్డి వెల్లడించారు.
అలాగే.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంపై కూడా కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ఈటల రెండేళ్లుగా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈటల రాజేందర్ శాసనసభ సభ్యత్వానికి, ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో అధికారపార్టీ హుజూరాబాద్‌లో ఈటలకు దీటుగా బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న సమయంలో.. ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సన్నిహితుడు కౌశిక్ రెడ్డి కేటీఆర్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి దీనిపై మీడియాతో మాట్లాడారు.
Also Read: