సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. మల్లికార్జునస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసానికి ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవాలయాల అభివృద్ధి కి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయిన తలసాని చెప్పారు. కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు అన్ని వసతులు, సౌకర్యాలను కల్పించామన్నారు.
దాసారం గుట్టపై భక్తులకోసం వసతి గృహాల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. దేవాదాయ శాఖ, ఆర్టీసీ ఆధ్వర్యంలో బస్టాండ్ నిర్మాణం చేపట్టబోతున్నామని చెప్పారు.
కొండపోచమ్మ ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ 10 కోట్ల రూపాయలు మంజూరు చేశారని అన్నారు.
ఆలయ విస్తరణ, భక్తులకు సౌకర్యాల కల్పనకు నిధులు ఖర్చు చేయడం జరుగుతుందని అన్నారు. 100 ఎకరాల విస్తీర్ణంలో దశల వారిగా అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి హరీష్ రావు, తాను అధికారులతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని మంత్రి తలసాని వివరించారు.