కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం.. క్రమశిక్షణ కమిటీ ముందుకు మంత్రి కొండా సురేఖ..

పరకాల రాజకీయాలపై కొండా సుస్మితా పటేల్ చేసిన ఘాటు వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో రేవూరినే అభ్యర్థిగా ప్రకటించడాన్ని ఆమె ప్రశ్నిస్తూ.. పరకాలలో పోటీ చేసేది, గెలిచేది తానేనంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం.. క్రమశిక్షణ కమిటీ ముందుకు మంత్రి కొండా సురేఖ..
Konda Susmitha Patel Comments Row

Updated on: Aug 20, 2026 | 9:37 AM

పరకాల మా ఇలాఖా.. మాతో పెట్టుకుంటే తడాఖా చూపిస్తాం.. అంటూ కొండా దంపతుల కూతురు కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో సంచలనంగా మారాయి.. సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో రేవూరినే అభ్యర్థి అని ప్రకటించడం సరికాదంటూనే.. పరకాలలో పోటీ చేసేది గెలిచేది తానేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిపై చేసిన ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాలను అలానే.. కాంగ్రెస్ పార్టీని షేక్ చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే రేవూరిపై సుస్మిత చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఈ మేరకు మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ నోటీసులు పంపించింది. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని సురేఖకు ఆదేశాలు జారీ చేసింది.

దీంతో ఇవాళ PCC క్షమశిక్షణ కమిటీ ముందు మంత్రి కొండా సురేఖ హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొండా సుస్మిత కామెంట్స్‌ సంచలనంగా మారిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీకి, PCCకి మంత్రి కొండా సురేఖ వివరణ ఇవ్వనున్నారు. సుస్మిత అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో.. రాతపూర్వకంగా సురేఖ వివరణ ఇవ్వనున్నారు. కాగా.. పరకాలలో సీఎం సభ తర్వాత చిచ్చు రాజుకుంది. సీఎం రేవంత్ రెడ్డి రేవూరిని మళ్లీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఈ వివాదం మొదలైంది..కొండా సురేఖ బర్త్‌ డే వేడుకల్లో సుస్మిత పటేల్ మాట్లాడుతూ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి వృద్ధుడికి టికెట్ ప్రకటించడమేంటని ప్రశ్నించారు.

అయితే.. కొండా ఫ్యామిలీపై పార్టీతో పాటు మంత్రులు సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.. ప్రతిసారి ప్రభుత్వంపై విమర్శలతో ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని.. చర్యలు తీసుకోవాలని పీసీసీపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా సీఎం, ప్రభుత్వంపై కొండా సుస్మిత విమర్శలు చేశారు. అప్పుడు మీనాక్షి, మహేష్ గౌడ్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఇలాంటివి పునరావృతం కావొద్దని అప్పుడే మీనాక్షిహెచ్చరించినా.. మళ్లీ అదే స్థాయిలో విరుచుకు పడ్డారు సుస్మిత. దీంతో.. పూర్తి నివేదిక ఇవ్వాలని వరంగల్‌ డీసీసీని, PCCని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కోరారు.

జక్కిడి ప్రభాకర్‌రెడ్డి సస్పెన్షన్

కాగా.. మాజీ మంత్రి చిన్నారెడ్డికి కూడా క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ వివరణ కోరింది. 3రోజుల్లో వివరణ ఇవ్వాలని చిన్నారెడ్డికి ఆదేశాలిచ్చింది. వనపర్తిలో MLA మీద చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరింది.

ఇదిలాఉంటే.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్‌రెడ్డిని సస్పెన్షన్ చేస్తూ నోటీస్ జారీ చేసింది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ. వ్యక్తిగత విషయాలతో పాటు కులాల పేరుతో ప్రభాకర్‌రెడ్డి దూషించినట్లు కాంగ్రెస్ పార్టీ నిర్ధారణ చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us