Kishan Reddy: ఖాళీ క్లాస్ రూమ్‌లు.. తుస్సుమన్న గ్యారెంటీలు.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు తగ్గుదల, నిధుల దుర్వినియోగంపై కిషన్ రెడ్డి రేవంత్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వేలాది పాఠశాలలు మూసివేత దశకు చేరుకున్నాయని, విద్యకు కేటాయించిన బడ్జెట్ కేవలం కాగితాలకే పరిమితమైందని ఆరోపించారు.

Kishan Reddy: ఖాళీ క్లాస్ రూమ్‌లు.. తుస్సుమన్న గ్యారెంటీలు.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్..
Kishan Reddy

Updated on: Dec 19, 2025 | 11:04 AM

తెలంగాణలో విద్యావ్యవస్థ.. రాష్ట్ర పాలకులు నిర్లక్ష్యానికి బలైపోతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు పొంతన లేకుండా పోయిందని..  ప్రభుత్వ పాఠశాలలు సున్నా అడ్మిషన్ల దిశగా పయనిస్తున్నాయని అన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో వెల్లడైన గణాంకాలు తెలంగాణ విద్యాశాఖ పతనానికి అద్దం పడుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు.. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాల్లో 10 కంటే తక్కువ మంది విద్యార్థులు లేదా అడ్మిషన్లే లేని పాఠశాలలు ఉండటం అత్యంత దురదృష్టకరమని.. దేశంలో ఇలాంటి పరిస్థితి ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. 2022-23లో ఇలాంటి పాఠశాలల సంఖ్య 3,576గా ఉండగా, అది 2024-25 నాటికి 5,021కి పెరిగిందని చెప్పారు.

బడ్జెట్ కేటాయింపు.. కేవలం కాగితాలకేనా?

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర బడ్జెట్‌లో 15శాతం నిధులను విద్య కోసం కేటాయిస్తామని హామీ ఇచ్చింది.. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఆ హామీలో సగం కూడా లేవన్న ఆయన.. రాబోయే రోజుల్లో వాస్తవ కేటాయింపులు వెలుగులోకి వస్తే ఆ సంఖ్య ఇంకా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం పేరుతో ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులను సడలించాలని, మరిన్ని రుణాలు ఇచ్చేలా కేంద్రాన్ని కోరుతున్నారు.. అయితే ఈ నిధులు నిజంగా విద్యావ్యవస్థ కోసం ఖర్చు చేస్తున్నారా? లేక ఇతర అవసరాలకు దారి మళ్లిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్.. ఇద్దరూ ఒక్కటే!

గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలను నిర్లక్ష్యం చేయగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. విద్యా వ్యవస్థను బాగు చేయడం కంటే ప్రాజెక్టుల పేరుతో నిధులు దారి మళ్లించి సొంత జేబులు నింపుకోవడమే ఈ రెండు పార్టీల ఏకైక లక్ష్యమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..