ఇది ఆధునిక డిజిటల్ యుగం. టెక్నాలజీని అందిపుచ్చుకుని మానవుడు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ప్రపంచంతో పోటీ పడుతూ ఊహకందని విధంగా దూసుకుపోతున్నాడు. అయినా కొన్ని మూఢనమ్మకాలు మాత్రం ప్రజలను ఇంకా వెంకటాడుతూనే ఉన్నాయి. చేతబడి, మంత్రాలు, బాణామతి వంటివి ఉన్నాయంటూ అనవసరంగా బెంబేలెత్తిపోతున్నారు. ఆ అనుమానంతోనే చివరికి కొట్లాడుకోని, ప్రాణాల మీదకు తెచ్చుకుని చనిపోతున్నారు. ఇటివలే సిద్దిపేట జిల్లాలో జరిగిన రెండు ఘటనలు కలకలం రేపుతున్నాయి.
చేతబడులు చేస్తున్నారన్న అనుమానంతో వేర్వేరు ఘటనల్లో ఇద్దరిని హతమార్చారు. ఓ ఘటనలో సుపారీ ఇచ్చి హత్య చేయించగా, మరో ఘటనలో తండ్రిని కన్న కొడుకు, తమ్ముడే హత్య చేసి తగులబెట్టారు. ఆధునిక యుగంలోను ఇలాంటి మూఢనమ్మకాల మాయలో పడి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. చేతబడి అనుమానంతో సిద్దిపేట జిల్లాలో జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ రెండు ఘటనలకు సంబంధించి కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బత్తుల రజిత, తిరుపతి దంపతుల కుమార్తె గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. రజిత కూడా అస్వస్థతకు గురికావడంతో ఇద్దరినీ వైద్యులకు చూపించారు. ఎంతకీ రోగం నయం కాకపోవడంతో అదే గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బండి వెంకటయ్య మంత్రాలు చేసినట్టు అనుమానించారు. ఎలాగైనా వెంకటయ్యను హతమార్చాలని ప్లాన్ వేశాడు తిరుపతి. ఈక్రమంలోనే నంగునూరుకు చెందిన పరశురాములు, సాయిగౌడ్‌లకు రూ. 5 లక్షలు సుపారీ ఇచ్చాడు. అదనంగా లావణి పట్టా భూమిని రిజిస్ట్రేషన్ చేయిస్తానని హామీ ఇచ్చాడు.
దీంతో అడ్వాన్స్ కింద గతేడాది డిసెంబర్ 27న 50 వేల రూపాయలు తీసుకున్నారు నిందితులు. ఫిబ్రవరి 3వ తేదీన నంగునూరు వెళ్లిన వెంకటయ్య అక్కడ బంధువులతో కలిసి మద్యం తాగాడు. ఇదే కరెక్ట్ టైంగా భావించిన నిందితులు మర్డర్ స్కెచ్ వేశారు. రాత్రికి సొంతూరు బయలుదేరిన వెంకటయ్యను సాయిగౌడ్, సాయి, అరవింద్, రంజిత్ ఘనపూర్ చెక్ డ్యాం వద్ద వెంకటయ్యను ఆపి అగ్గిపెట్టె అడిగారు. అగ్గిపెట్టే తీస్తుండగా వెంటనే టవల్, తాడుని వెంకటయ్య మెడకు బిగించి చంపేశారు. అనుమానం రాకుండా పక్కనే ఉన్న జేసీబీ గుంతలో మృతదేహాన్ని బైకును పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి పారిపోయారు.
అయితే, అంత్యక్రియలు చేస్తుండగా మెడ వీపు భాగంలో గాయాలు కన్పించడంతో హత్యగా భావించి రాజగోపాలపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబసభ్యులు. దీంతో మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. రిపోర్ట్ లో హత్య అని తేలడంతో ఫోన్ సిగ్నల్ ద్వారా ఆరుగురు నిందితులని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారణలో అసలు విషయం ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
ఈ ఘటన మరువక ముందే ఫిబ్రవరి 9వ తేదీన రాఘవపూర్ గ్రామ శివారులో సిరిసిల్ల జిల్లాకి చెందిన భూమయ్యని హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు దుండగులు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేయగా భూమయ్యాని మంత్రాలు కన్న కొడుకు, తమ్ముడే హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. గత కొన్ని రోజులుగా భూమయ్య తమ్ముడు కనకయ్య కుటుంబం అనారోగ్యం బారిన పడుతున్నారు. దానికి కారణం భూమయ్య చేతబడే అనే కక్ష పెంచుకున్నాడు. భూమయ్య కొడుకు ప్రవీణ్ కి విషయం చెప్పగా ఇద్దరు కలిసి హత్యకు ప్లాన్ వేశారు. మద్యం తాగుదామని తీసుకెళ్లి మద్యంలో పురుగుల మందు కలిపి తండ్రికి ఇచ్చాడు ప్రవీణ్. తరువాత భూమయ్య అపస్మారక స్థితిలోకి వెళ్ళగానే టవల్‌తో గొంతు బిగించి హత్య చేశారు. ముఖం గుర్తుపట్టకుండా ఉండేందుకు గడ్డితో శవాన్ని తగలబెట్టారు. అనంతరం అక్కడి నుంచి జారుకున్నారు. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.
ఈ రెండు ఘటనలతో పాటు గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇలాంటివి చాలానే చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఏదైనా రోగం వస్తే ఆస్పత్రికి వెళ్తే నయమవుతుంది. కానీ ఇలాంటి చేతబడులు మంత్రాలకు చింతపండ్లు రాలవు అన్న విషయాన్ని జనాలు గమనించాలి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…