Khammam student dies in US: అమెరికాలో కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఇండియానా రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీలో తెలంగాణలోని ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన పుచ్చా వరుణ్‌రాజ్ (29) MS చదువుతూ పార్ట్‌టైం జాబ్ చేస్తున్నాడు. అక్టోబర్ 30న జిమ్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఒక దుండగుడు కత్తితో అతడిపై దాడి చేశాడు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వరుణ్‌ను ఆస్పత్రికి తరలించారు.. అనంతరం కేసు నమోదు చేసుకుని దుండగుడిని అరెస్టు చేశారు.
గతనెల 30 నుంచి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరుణ్‌రాజ్ తొమ్మిది రోజుల పాటు ప్రాణాల కోసం పోరాడి మంగళవారం మృతి చెందాడు. ఈ మేరకు అమెరికా అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వరుణ్‌రాజ్ మృతితో అతడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వరుణ్ మృతదేహాన్ని ఇండియా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. ఈ దాడి జరిగిన మూడు రోజుల తర్వాత ఈ ఘటనపై స్పందించిన అమెరికా.. తీవ్ర విచారం వ్యక్తం చేసింది. నిందితుడిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. అంతేకాదు, ఈ ఘటన అత్యంత బాధాకరమంటూ విచారం వ్యక్తం చేసింది.
అమెరికాలో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండం కలకలం రేపుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..