
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండి ప్రోలులో విషాదం నెలకొంది. తన ఏడాది వయస్సు గల బాబును ఆడిస్తూ.. సంతోషంగా గడిపింది. బుడి బుడి అడుగులు వేయిస్తూ జోల పాడింది. అంతలోనే డాబాపై నుంచి ఏడుపులు.. గట్టిగా కేకలతో శబ్దాలు వినిపించాయి. ఏమి జరిగిందో తెలియక కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కి పడి పరుగులు తీశారు. డాబాపైకెళ్ళి చూడగా తోడికోడలుతో ఫోన్లో మాట్లాడుతూ కుప్పకూలింది ఆ తల్లి.
భయబ్రాంతులకు లోనైన కుటుంబ సభ్యులు హుటా హుటిన ఆసుపత్రికి తరలించేలోపే ఆ మహిళ ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. మృతురాలు శిరీష తన తోటి కోడలితో ఫోన్లో మాట్లాడుకుంటూ డాబాపైకి వెళ్ళింది. మాట్లాడుతున్న సమయంలోనే ఆమెకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో డాబాపైనే కుప్పకూలిపోయింది. అదే సమయంలో పక్కనే ఉన్న ఆమె ఏడాది కుమారుడు ఏడుస్తుండటంతో కుటుంబసభ్యులు డాబాపైకి వెళ్లి చూడగా శిరీష అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే మృతి చెందింది.
శిరీషకు రఘునాథ పాలెం మండలంకు చెందిన వ్యక్తి తో వివాహం జరిగింది. తన పుట్టినిల్లు పిండిప్రోలు గ్రామానికి వచ్చింది. తల్లిగారి ఇంట్లో కుటుంబ సభ్యులతో గడపడానికి వచ్చి అనంత లోకాలకు వెళ్లడంతో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.