Khammam: అట్టాంటి ఇట్టాంటి పుంజు కాదు.. అందుకే ఇలా.. కానీ పాపం..

మూగజీవాలపై ప్రేమ ఎంత దాకా వెళ్లొచ్చో చూపించిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుడిలా పెంచుకున్న కోడిపుంజు మృతి చెందడంతో… దానికి అంత్యక్రియలు, కర్మకాండలు నిర్వహించి, శిలాఫలకం కూడా ఏర్పాటు చేశారు. ఈ విచిత్ర ఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Khammam: అట్టాంటి ఇట్టాంటి పుంజు కాదు.. అందుకే ఇలా.. కానీ పాపం..
Pet Rooster

Edited By:

Updated on: Jan 01, 2026 | 2:45 PM

తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయులు మరణిస్తే వారికి అంత్యక్రియలు నిర్వహించి, కర్మ కాండలు నిర్వహిస్తారు. వారి గుర్తుగా సమాధులు నిర్మిస్తారు. అయితే ఓ గ్రామంలో కోడికి కర్మ కాండలు నిర్వహించి..శిలా ఫలకం ఏర్పాటు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గ్రామానికి చెందిన వేల్పుల మెహర్ బాబు కుటుంబం మూడేళ్లుగా ఓ కోడిపుంజును పెంచుతున్నారు. కుటుంబంలో ఒకరిగా భావిస్తూ పెంచుతున్న ఈ కోడిపుంజు కొత్త వ్యక్తులు వస్తే.. శునకం మాదిరి ఎగబడుతూ వారికి చేదోడుగా ఉండేది. దీంతో ఆ కుటుంబం తన ఇంటి ముందు ‘కోడి ఉంది జాగ్రత్త’ అని బోర్డు సైతం ఏర్పాటు చేశారు. ఇటీవల వీధికుక్కల దాడిలో కోడిపుంజు తీవ్ర గాయాలతో మృతి చెందింది. దీంతో కుటుంబంలోని వ్యక్తి మృతి చెందినట్లు భావిస్తూ ఆవేదన చెందిన మెహర్ బాబు కుటుంబీకులు దానికి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతేకాక కర్మకాండలు నిర్వహించి శ్మశానంలో కోడిపుంజు బొమ్మతో కూడిన శిలాఫలకం ఏర్పాటు చేయడంతో పాటు విందు ఏర్పాటు చేశారు. ఈ ఘటన విచిత్రంగా ఉన్నా..మూగ జీవాలపై తన ప్రేమను ఈ విధంగా చాటుకోవడం పలువురు అభినందిస్తున్నారు.

వీడియో దిగువన చూడండి…