Telangana: ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం.. మరొకరికి ఏసీబీ నోటీస్ జారీ!

| Edited By: Balaraju Goud

Jan 25, 2025 | 4:15 PM

ఫార్ములా ఈ-రేస్‌ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే, కేటీఆర్‌ సహా పలువురిని ప్రశ్నించిన ఏసీబీ.. లేటెస్ట్‌గా మరో కీలక నిర్ణయం‌ తీసుకుంది. ఫార్ములా ఈ-రేస్‌‌ కేసులో ఎఫ్‌ఈవో కంపెనీకి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఎఫ్‌ఈవో కంపెనీకి నగదు బదిలీ చేసింది హెచ్‌ఎండీఏ. అయితే ఏసీబీ నోటీసులకు స్పందించిన ఎఫ్‌ఈవో సీఈవో.. నాలుగు వారాల సమయం కోరారు.

Telangana: ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం.. మరొకరికి ఏసీబీ నోటీస్ జారీ!
Formula E Race Case
Follow us on

ఏసీబీ దర్యాప్తు చేస్తున్న ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ డిసెంబర్ 19న ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురిని నిందితులుగా చేర్చింది. ఏ1 గా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, ఏ2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3 గా హెచ్ఎండీఏ అధికారి బిఎల్ ఎన్ రెడ్డి లను నిందితులుగా చేర్చింది. కానీ ఈ కేసులో నిధులు వెళ్లిన ఎఫ్ఈవో సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదని గతంలో అనేకసార్లు బీఆర్ఎస్ న్యాయవాదులు కోర్టులో వాదించారు. వారితో పాటు మాజీ మంత్రి కేటీఆర్ సైతం అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ నిర్వహించిన తరుణంలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఎఫ్ఈవోకు ఎసీబీ అధికారులు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. అయితే ఎఫ్ఈవో ను నిందితుల జాబితాలో చేరుస్తారా లేదా సాక్షిగా పరిగణిస్తారా అనే విషయం ఆసక్తిగా మారింది. నిబంధనల ప్రకారం రేస్ నిర్వహించేందుకు చెల్లించాల్సిన డబ్బులను అగ్రిమెంట్‌కు విరుద్ధంగా హెచ్ఎండీఏ చెల్లించిన విషయం తెలిసిందే. అయితే అగ్రిమెంట్ లేకపోయినా చెల్లింపులు ఎవరు చేసిన నిధులు చేరింది మాత్రం ఎఫ్ఈవో సంస్థకే. దీంతో ఈ సంస్థను సాక్షిగా పరిగణిస్తారా లేదా నిందితుల జాబితాలో చేరుస్తారా అన్నదీ ఆసక్తికరంగా మారింది.

మరోవైపు ఈ కేసులో మరికొంతమంది సాక్షులను ఏసీబీ విచారిస్తోంది. హెచ్ఎండీఏ లోని పలువురు అధికారుల నుండి ఏసీబీ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది. వీరితో పాటు గతంలో ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ కోసం అప్పటి ప్రభుత్వం రెండు కమిటీలను సైతం నియమించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు మేనేజింగ్ కమిటీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియమిస్తూ జీవోను సైతం జారీ చేసింది. ఆ కమిటీలో ఉన్న సభ్యుల స్టేట్‌మెంట్లను ఇప్పటికే ఏసీబీ రికార్డు చేసింది. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా త్వరలోనే కేటీఆర్ తోపాటు అరవింద్ కుమార్ కు మరో దఫా నోటీసు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమైంది.

ఇక తాజాగా ఎఫ్ఈవో సంస్థకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సీజన్ 10 నిర్వహణ కోసం సీఎం రేవంత్ రెడ్డిని 2023 డిసెంబర్ లోనే ఎఫ్ఈవో సంస్థ సీఈవో ఆల్బర్టో కలిశారు. జనవరి 16న ఆయనకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అయితే ఏసీబీ ఇచ్చిన నోటీస్‌కు జనవరి 25న ఆయన రిప్లై ఇచ్చారు. ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు తమకు నాలుగు వారాల సమయం కావాలని కోరారు. దీనిపై ఇంకా ఏసీబీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..