కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ప్రాజెక్టును అధ్యయనం చేయడానికి పిల్లర్లు కుంగడానికి గల కారణాలను విశ్లేషించేందుకు.. ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. సత్వర చర్యలకు సూచనలు, సలహాలతో ఇవ్వడంతో పాటు.. 4నెలల్లో పూర్తి నివేదికను NDSAకి ఇవ్వనుంది కమిటీ. కాళేశ్వరంపై నువ్వా?నేనా? అన్నట్టుగా తలపడుతున్నాయి కాంగ్రెస్, బీఆర్‌ఎస్. ప్రాజెక్టులో లోపాలు ఎత్తిచూపుతూ అధికారపార్టీ… జరిగిన నష్టమేమీ లేదంటూ ప్రతిపక్షం… ఇప్పటికే మేడిగడ్డను సందర్శించి రాజకీయ వేడిని పెంచాయి.
తాజాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటును చేసింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో… ఐదుగురు సభ్యులు శివకుమార్‌శర్మ, రాహుల్, అమితాబ్ మీనా, యూసీ విద్యార్థి, ఆర్.పాటిల్… ప్రాజెక్టుపై స్టడీ చేయనున్నారు. కాళేశ్వరంలో ప్రధానమైన మూడు ఆనకట్టలకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి, అధ్యయనం చేయడంతో పాటు… పగుళ్లకు గల కారణాలను విశ్లేషించి, తగిన సిఫార్సులు చేయనుంది అయ్యర్ కమిటీ. నాలుగు నెలల్లో NDSAకు నివేదిక ఇవ్వనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలపైనా NDSAకు సలహాలు, సూచనలు ఇవ్వనుంది కమిటీ. త్వరలోనే.. ఈ కమిటీ మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు రానుంది.
మేడిగడ్డ విషయంలో బీఆర్‌ఎస్, బీజేపీలు డ్రామాలాడుతున్నాయని ఆరోపించారు మంత్రి సీతక్క. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ.. కాళేశ్వరంలో అవినీతి అనడమే తప్ప విచారణ జరిపించలేదని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అన్నింటినీ బయటకు లాగుతోందన్నారు. మరోవైపు, కాళేశ్వరంపై ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా… కరీంనగర్‌లో బహిరంగసభను ఏర్పాటుచేస్తోంది బీఆర్‌ఎస్. దీంతో, ఈ రచ్చ ఇప్పటితో ఆగేలా కనిపించడం లేదని మాత్రం స్పష్టమవుతోంది. ఆలోపు కమిటీ ఏం తేలుస్తుందో చూడాలి మరి.