KCR National Party Launch Updates: జాతీయ పార్టీగా టీఆర్‌ఎస్.. బీఆర్ఎస్‌గా పేరు మార్పు.. సంచలన ప్రకటన చేసిన కేసీఆర్..

|

Oct 05, 2022 | 2:01 PM

జాతీయ రాజకీయ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్‌ రాష్ట్ర సమితిగా టీఆర్‌ఎస్‌ మార్పు చేస్తూ చేసిన తీర్మానంపై సంతకం చేశారు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌. జాతీయ పార్టీగా మారుస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

KCR National Party Launch Updates: జాతీయ పార్టీగా టీఆర్‌ఎస్.. బీఆర్ఎస్‌గా పేరు మార్పు.. సంచలన ప్రకటన చేసిన కేసీఆర్..
Follow us on

తెలంగాణ రాజకీయ యవనికపై నూతన అధ్యాయం మొదలైంది. కేసీఆర్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా మారింది. నాడు జలదృశ్యం వేదికపై ఏర్పడ్డ టీఆర్‌ఎస్‌.. నేడు అమృతోత్సవ భారతంలో బీఆర్ఎస్‌గా మారింది. జాతీయ రాజకీయ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్ రాష్ట్ర సమితిగా టీఆర్‌ఎస్‌ మార్పు చేస్తూ చేసిన తీర్మానంపై సంతకం చేశారు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌. జాతీయ పార్టీగా మారుస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. బీఆర్‌ఎస్‌ జెండా, అజెండాపై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య సమావేశం ముగిసింది. సమావేశంలో ఎమ్మెల్యేలతో పాటు పార్లమెంట్‌ సభ్యులు, జిల్లా పరిషత్‌ అధ్యక్షులు సహా 283 మంది కీలక ప్రతినిధులు భేటీకి హాజరయ్యారు. అలాగే సమావేశానికి పలు రాష్ట్రాల నేతలు సైతం హాజరయ్యారు. కర్నాటక మాజీ ముఖ్యమంతి, జేడీఎస్‌ నేత హెడీ కుమారస్వామి, ఆయన పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధినేత తిరుమావళన్‌తో పాటు ఎంపీలు భేటీకి హాజరయ్యారు.

బీఆర్‌ఎస్‌గా మారుస్తూ చేసిన తీర్మానం..

టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తూ చేసిన తీర్మానాన్ని పార్టీ సీనియర్‌ నేత, రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్‌ బృందం ఢిల్లీకి తీసుకెళ్లనుంది. కేసీఆర్‌ చార్టర్డ్‌ విమానంలో ఈ సాయంత్రమే.. వీరు ఢిల్లీ వెళ్తారు.. గురువారం నాడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ తీర్మానాన్ని సమర్పిస్తారు. ఈసీఐ దీనిని పరిశీలించి ఆమోదం తెలపగానే బీఆర్‌ఎస్‌ ప్రస్థానం మొదలవుతుంది. జాతీయ పార్టీగా మారిన అనంతరం అఖిల భారత స్థాయిలో కొన్ని అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా తొలుత కిసాన్‌ సంఘ్‌ను ఏర్పాటు చేయనున్నారు.

బలాన్ని పెంచుకునే దిశగా కేసీఆర్‌ అడుగులు..

ఇప్పటి వరకూ ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్.. ఇక పాన్‌ ఇండియా పార్టీగా మారనుంది. టీఆర్ఎస్‌ నుంచి BRSకు అప్‌డేట్‌ అవుతోంది. అందుకే బలాన్ని పెంచుకునే దిశగా కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు. ఎంతోమందితో విస్తృత చర్చలు జరిపిన తర్వాతే గులాబీ బాస్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు నేతలు చెప్తున్నారు. జాతీయ పార్టీగా ఏర్పడ్డాక తెలంగాణలో సైతం ఇప్పుడున్న సభ్యత్వం సరిపోదని, భారీగా పెంచాలని నేతలకు సూచించారు. భారత్‌ రాష్ట్ర సమితికి బయటి రాష్ట్రాల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. పార్టీ పెట్టిన వెంటనే ఆదరణ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పాన్‌ ఇండియా పార్టీ ఏర్పడ్డాక.. నేతలకు జాతీయ స్థాయిలో అవకాశాలు వస్తాయని.. వివిధ రాష్ట్రాల్లో పార్టీ తరపున ఇన్‌ఛార్జులుగా పనిచేసే అవకాశం లభిస్తుందని కేసీఆర్‌ చెబుతున్నారు.

కేసీఆర్‌ ఆహ్వానం మేరకు హైదరాబాద్‌కు 40 మంది ప్రముఖులు

కేసీఆర్‌ ఆహ్వానం మేరకు దేశవ్యాప్తంగా 40 మంది ప్రముఖులు హైదరాబాద్‌ వచ్చారు. వారిలో రైతు సంఘాల నాయకులు కూడా ఉన్నారు. ఇప్పటికే అనేకమంది రైతు సంఘాల ప్రతినిధులతో కేసీఆర్‌ చర్చలు జరిపారు. వారంతా హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు నేతలందరి సహకారంతో కిసాన్‌సంఘ్‌ను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, ఉచిత విద్యు త్తు తదితర కార్యక్రమాలను దేశమంతటా ఆ సంఘం ద్వారా ప్రచారం చేయనున్నట్లు తెలిసింది.

ఈ రాష్ట్రాలపైనే బీఆర్ఎస్‌ స్పెషల్ ఫోకస్

బీఆర్ఎస్‌.. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను ప్రధానంగా టార్గెట్‌ చేస్తోంది. ఈ రాష్ట్రాల్లో తమకు గెలుపు అవకాశాలున్న వంద సీట్లను గుర్తించిన కేసీఆర్‌.. అందులో 50 నుంచి 60 స్థానాల్లో గెలిచేందుకు చాలా అవకాశాలున్నాయని భావిస్తున్నారు. మహారాష్ట్రలో మరఠ్వాడా ప్రాంతం, కర్ణాటకలోని తెలుగు ప్రాంతాలు, బెంగళూరు నగరాల్లోనూ పార్టీకి ఫ్యూచర్‌ ఉంటుందని భావిస్తున్నారు కేసీఆర్‌. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని, రాష్ట్రంలో ఉన్న అభివృద్ది మరెక్కడా లేదని.. ఇదే బీఆర్ఎస్‌కు బూస్ట్‌ ఇస్తుందని కేసీఆర్‌ అంచనా.

మరిన్ని తెలంగాణ వార్తాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..