తెలంగాణ పాలిటిక్స్‌లో బోయపాటి సినిమా రేంజ్ సీన్లు… తెరమీదకు సడన్ స్టార్లు..!

| Edited By: Janardhan Veluru

Sep 13, 2024 | 5:21 PM

Kaushik Reddy vs Arekapudi Gandhi: కీలకమైన పీఏసీ ఛైర్మన్ పదవిని అరెకపూడి గాంధీకి ఇస్తున్నట్టు ప్రకటించింది కాంగ్రెస్ సర్కారు. అదుగో..సరిగ్గా రాజకీయ చిచ్చు అక్కడ మొదలైంది. చిచ్చు సంగతి సరే.. ఇక్కడే ఓ సడన్ స్టార్ పుట్టుకొచ్చారు. దటీజ్ మిస్టర్ కౌశిక్ రెడ్డి. గతంలో అప్పటి గవర్నర్ దెబ్బకు ఎమ్మెల్సీ వచ్చినట్టే వచ్చి చేజారిపోయినా... ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఎలాగోలా ప్రసన్నం చేసుకుని మొత్తానికి అసెంబ్లీలో అడుగుపెట్టేశారు కౌశిక్ రెడ్డి.

తెలంగాణ పాలిటిక్స్‌లో బోయపాటి సినిమా రేంజ్ సీన్లు... తెరమీదకు సడన్ స్టార్లు..!
Kaushik Reddy Vs Arekapudi Gandhi
Follow us on

కష్టంలో ఉన్నప్పుడు కాడి వదిలేస్తున్న నేతలు ఓ వైపు… అవకాశాలు సృష్టించుకొని మరీ ఎదురుదాడి చేసే అధికార పార్టీ మరో వైపు.. పదేళ్ల అధికారం పోయినా లోక్ సభ ఎన్నికల్లోనైనా నాలుగైదు సీట్లు గెలిచి పట్టునిలుపుకుందామనుకున్నారు గులాబీ నేతలు. అయితే సున్నాకి పరిమితం చేసి… కారును షెడ్‌కి పంపించారు ఓటర్లు. గడిచిన పదేళ్లు తెలంగాణలో తిరుగులేదనుకున్న కేసీఆర్ ఇప్పుడు కామ్‌గా ఫామ్ హౌజ్‌కే పరిమితమయ్యారు. అదంతా వ్యూహాత్మక మౌనమన్నది గులాబీ నేతలు చెబుతున్న మాట. కేటీఆర్, హరీశ్ రావు అప్పుడప్పుడూ అలా జనంలోకొచ్చి వెళ్తున్నా.. అధికార పార్టీ దూకుడు ముందు.. రేవంత్ రెడ్డి ఎదురుదాడి ముందు.. ప్రతిపక్షం పాచికలు ఇన్నాళ్లూ పెద్దగా పారలేదు. అసెంబ్లీలోనూ బీఆర్ఎస్ వైపు నుంచి కేటీఆర్, హరీశ్ రావు వాయిస్ తప్ప.. మరో నేత వాయిస్ వినిపించలేదు. అందుకే ఒక్క అవకాశం కోసం వారు వెయిట్ చేస్తూ వచ్చారు. సరిగ్గా అలాంటి అవకాశం సడన్‌గా వచ్చింది. ఇంతకీ వచ్చిందా.. కాంగ్రెస్ ఇచ్చిందా..? సరే ఈ డిస్కషన్‌ ఇప్పుడెందుకు లెండి… అసలు కథకు వచ్చేద్దాం.

కీలకమైన పీఏసీ ఛైర్మన్ పదవిని అరెకపూడి గాంధీకి ఇస్తున్నట్టు ప్రకటించింది కాంగ్రెస్ సర్కారు. అదుగో..సరిగ్గా రాజకీయ చిచ్చు అక్కడ మొదలైంది. చిచ్చు సంగతి సరే.. ఇక్కడే ఓ సడన్ స్టార్ పుట్టుకొచ్చారు. దటీజ్ మిస్టర్ కౌశిక్ రెడ్డి. గతంలో అప్పటి గవర్నర్ దెబ్బకు ఎమ్మెల్సీ వచ్చినట్టే వచ్చి చేజారిపోయినా… ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఎలాగోలా ప్రసన్నం చేసుకుని మొత్తానికి అసెంబ్లీలో అడుగుపెట్టేశారు కౌశిక్ రెడ్డి. ఆ తర్వాత అప్పుడప్పుడు ఆయన హడావుడి కనిపించినప్పటికీ.. అటు కేటీఆర్.. ఇటు హరీశ్ రావు లాంటి దిగ్గజాల మధ్య ఆయన వాయిస్ పెద్దగా వినిపించలేదు. అడపాదడపా మీడియా సమావేశాలు పెట్టి అధికార పార్టీపై ఆయన ఆరోపణలు చేసినా.. సవాళ్లు చేసి బహిరంగ స్నానాలు, ఒట్టులు వేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

కౌశిక్ రెడ్డి వెర్సెస్ గాంధీగా మారిన పొలిటికల్ వార్..

అయితే పీఏసీ ఛైర్మన్ పదవి అరెకపూడికి గాంధీకి ఇవ్వడం.. టెక్నికల్‌గా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పటికీ మనసంతా కాంగ్రెస్లోనే ఉందన్న విషయం బహిరంగ రహస్యం కావడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు ఆయనపై ఎటాక్ మొదలెట్టారు. ఆ ఎటాక్‌లో భాగంగానే కౌశిక్ రెడ్డి నోరు కాస్త పెద్దదే కావడం.. ఆపై చేతల్లో కూడా ఆయన చీర – గాజులు చూపిస్తూ ఎదురుదాడి చెయ్యడం.. దానికి కాంగ్రెస్ అదే రేంజ్‌లో రియాక్ట్ అవడంతో ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. ఒకనొక టైంలో బీఆర్ఎస్ వెర్సెస్ కాంగ్రెస్ ఫైట్ అనుకున్నది కాస్త… మరో టర్న్ తీసుకుంది.

తెలంగాణ పొలిటికల్ వార్ కౌశిక్ రెడ్డి వెర్సెస్ అరెకపూడి గాంధీగా మారిపోయింది. అక్కడే మొదలయ్యింది అసలు సిసలైన రచ్చ. నిన్నగాక మొన్న ఎమ్మెల్యే అయిన కౌశిక్ రెడ్డి.. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న నన్నే విమర్శిస్తావా.. నువ్వెంత..నీ స్థాయి ఎంత అని గాంధీ… దమ్ముంటే రా చూసుకుందా అని కౌశిక్ రెడ్డి.. ఇలా సవాళ్లు ప్రతి సవాళ్లు… బూతు పురాణాలు.. దాడులు, ప్రతిదాడులతో పొలిటికల్ సీన్లు ఒక్కసారిగా బోయపాటి సినిమా రేంజ్‌కి చేరాయి. అటు కౌశిక్ రెడ్డి.. ఇటు గాంధీ పేర్లు తెలంగాణ వ్యాప్తంగా మార్మోగిపోయింది.

Arekapudi Gandhi Vs Kaushik Reddy

 

నువ్వు వస్తావా.. నన్ను రమ్మంటావా..అంటూ గురువారం కౌశిక్ రెడ్డి ఇంటికి అరెకపూడి, ఆయన మద్ధతుదారులు రావడంతో మొత్తం ఎపిసోడ్‌ కంప్లీట్ టర్న్ తీసుకుంది. పోలీసులు కూడా మొదట దీన్ని లైట్ తీసుకున్నట్టే కనిపించింది. గాంధీ ఇంటికి వచ్చి ఆయన ఇంటిపై గులాబీ జెండా ఎగురేస్తామన్న కౌశిక్ రెడ్డి ప్రకటించడంతో రచ్చ మొదలయ్యింది. ఆపై గాంధీయే కౌశిక్ ఇంటికి బయలుదేరి వెళ్లినా.. కౌశిక్ రెడ్డి విల్లా గేట్ ముందు పది మంది బందోబస్తుతో సరిపెట్టారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి గురించి తెలంగాణ మొత్తం చూసింది. ఇక దాంతో రేపొస్తా..కాసుకో అంటూ సవాల్ విసిరారు కౌశిక్. కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి తర్వాత కానీ..సిట్యువేషన్ ఎంత సీరియస్ అన్న విషయం పోలీసులకు అర్థం కాలేదు. ఆ దాడి తర్వాత ఒక్కసారిగా అలెర్ట్ అయిపోయారు. 24 గంటల్లో మొత్తం సీన్ మారిపోయింది. మాజీ మంత్రి హరీశ్ రావు సహా బీఆర్ఎస్ కీలక నేతలందర్నీ హౌజ్ అరెస్ట్ చేసేశారు. కాదు కూడాదన్నా వదల్లేదు. కౌశిక్ మాత్రం ఎలాగోలా తప్పించుకొని శంభీపూర్ రాజు ఇంటికి చేరుకున్నా.. అక్కడ నుంచి మాత్రం ఏ ఒక్కర్నీ అడుగు బయట పెట్టనివ్వలేదు. అటు గాంధీ ఇంటి దగ్గర కూడా అదే పరిస్థితి.

Harish Rao

ఈ ఇష్యూ ఎటు టర్న్ తీసుకున్నా.. ఓ సారి పొలిటికల్‌గా లాభ నష్టాల సంగతి చూస్తే…

బహుశా బీఆర్ఎస్‌‌కు కౌశిక్ రెడ్డి ఫ్యూచర్ ఫైర్ బ్రాండ్ కావచ్చేమో. ఇప్పటి రాజకీయాల్లో… నోరు పారేసుకుంటే కదా.. ఫైరో… గియిరో తెలిసేది. కౌశిక్ రెడ్డి గొంతు గట్టిదే కాబట్టి.. అవసరమైతే ఇలాంటి రచ్చ సృష్టించే సత్తా ఉందని తేలింది కాబట్టి.. మున్ముందు బీఆర్ఎస్ ఆయన్ను మరింత ముందుకు ఎగదొయ్యచ్చు. పది నెలలుగా వరుస కోలుకోలేని దెబ్బలు తింటున్న బీఆర్ఎస్‌కి.. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఒక్కసారిగా బూస్ట్ ఇచ్చిన ఇష్యూ ఇది. గతంలో అసెంబ్లీలో జరిగిన ఒకటీ… అరా ఇష్యూలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని ట్రై చేసినా ఇంత హడావుడి అయితే జరగలేదు. ఈ ఇష్యూ తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో బహుశా కాస్త కదలిక రావచ్చు.

 

రెండు రోజులుగా టోటల్ మీడియా ఇప్పుడు ఈ ఇష్యూపైనే దృష్టి పెట్టడం కూడా బీఆర్ఎస్‌కు కలిసొచ్చే అంశమే. నిన్న మొన్నటి వరకు వర్షాలు, వరదలతో సరిపెట్టుకున్న మీడియాకి.. ఇలాంటి రాజకీయ విందు భోజనం దొరికి చాలా రోజులైంది. దీంతో సహజంగానే ఫుల్ ఫోకస్ ఈ ఇష్యూ పైనే పెట్టింది. నిజానికి బీఆర్ఎస్‌కి కావాల్సింది కూడా ఇదే.. ఒకప్పుడు ఇలా ప్రెస్ మీట్ అంటే చాలు మొత్తం మీడియా వచ్చి వాలిపోయేది. కానీ ఇప్పుడు కీలక నేతలు తప్ప.. ఎవరు మాట్లాడతామని పిలిచినా పెద్ద చూపించిన టీవీలే లేకుండా పోయాయి. కానీ ఇన్నాళ్లకు ఆ పార్టీకి ఇంత కవరేజ్ వచ్చింది. అందుకే జరిగింది ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య రచ్చే అయినా ఇప్పుడు తెలంగాణ మొత్తం ఈ ఇష్యూ గురించే మాట్లాడుకుంటోంది. బీఆర్ఎస్‌కి ఇప్పుడు కావాల్సింది ఇదే. జనం నోళ్లలో ఎలాగైనా నానడం.

KCR, KTR

తగువు పెట్టి తమాషా చూస్తోందా..? రేవంత్ వేసిన గేమ్ ప్లాన్ చూస్తున్న చాలా మందికి ఇప్పుడు ఇదే డౌట్. ఓ రకంగా కాంగ్రెస్లో చేరీ… చేరనట్టు.. బీఆర్ఎస్‌లో ఉండీ.. ఉండనట్టు ఉన్న అరెకపూడి గాంధీని పీఏసీ ఛైర్మన్‌గా ఎంపిక చేసి.. బీఆర్ఎస్‌ని కావాలనే కెలికినట్టు కనిపిస్తోంది. సాధారణంగా పీఏసీ పదవిని ప్రతిపక్షానికిచ్చే ఆనవాయితీ ఉంది. కానీ బీఆర్ఎస్‌కి ఆ పదవి ఇవ్వడం కాంగ్రెస్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే మనిషి బీఆర్ఎస్‌తో.. మనసు కాంగ్రెస్‌తో ఉన్న గాంధీని ఎంపిక చేసింది. ఒక వేళ బీఆర్ఎస్ అరచి గీ పెడితే.. టెక్నికల్‌గా గాంధీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కనుక.. ప్రతిపక్షానికే ఇచ్చామని చెప్పొచ్చు. ఇప్పుడు అదే చెబుతున్నారు కూడా. పైగా గాంధీ కేటీఆర్ వర్గమని.. వాళ్లలో వాళ్లకే పడక ఇలా తిట్టుకుంటున్నారని ఆల్రెడీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి అనేశారు కూడా.

ప్రాంతీయ వివాదానికి తెరలేపిన కౌశిక్ రెడ్డి..

కావాలనే అన్నారో..లేదా.. అనుకోకుండా అన్నారో కౌశిక్ రెడ్డి.. గాంధీ విషయంలో ప్రాంతీయ వివాదం తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు దాని చుట్టూ ఇష్యూ బిల్డప్ చేస్తున్నారు. పదేళ్లుగా హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్లు ఎవరు ఔనన్నా.. కాదన్నా.. బీఆర్ఎస్‌తోనే ఉంటూ వచ్చారు. అందుకు పది నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ఫలితాలే సాక్ష్యం. కౌశిక్ రెడ్డి అన్న మాటలు పట్టుకొని అదే బీఅర్ఎస్ విధానమా అంటూ ఎటాక్ మొదలు పెట్టారు. అలా నెమ్మది నెమ్మదిగా సెటిలర్ల విషయంలో బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు గేమ్ ప్లాన్ స్టార్ట్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇది పెద్ద ప్లజ్ అవుతుందన్నది కాంగ్రెస్ నేతల లెక్క.

Cm Revanth Reddy, Bhatti Vikramarka

మొత్తంగా ఇన్నాళ్లూ… బీఆర్ఎస్ విషయంలో ఇన్నాళ్లూ ఎదురుదాడితో పదే పదే ఇరుకున పెడుతూ వస్తున్న కాంగ్రెస్… ఇప్పుడు గేర్ మార్చి… మరి స్పీడ్ పెంచింది. రేవంత్ స్పీడ్ దెబ్బను బీఆర్ఎస్‌ ఎలా ఎదుర్కొంటుంది..? ఇప్పటి వరకు ఫామ్ హౌజ్‌లోనే ఉన్న కేసీఆర్ రేపో.. మాపో మళ్లీ జనంలోకి వస్తారని చెబుతున్నారు. ఆయన రీ ఎంట్రీకి ఈ ఇష్యూ బేస్ అవుతుందా..? లేదా కేసీఆర్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్‌ కోసం ఆయన పార్టీ నేతలు, అభిమానులు మరి కొంత కాలం ఓపిక పట్టాల్సిందేనా..? మొత్తంగా కౌశిక్ రెడ్డి Vs అరెకపూడి గాంధీ ఎపిసోడ్‌ చివరకు ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో తెలియాలంటే.. మరికొంత కాలం వేచిచూడాల్సిందే.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి