
కార్తీక మాసం పవిత్రమైంది.. ఈ మాసంలో సోమవారం రోజు మహిళలు ఆలయాల్లో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.. ప్రముఖ ఆలయాల్లో భక్తులు రద్దీ ఉంటుంది. అయితే ఈ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామంలోని చిన్న అరుణాచలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో కార్తీక సోమవారం సందర్భంగా ఆలయంలో మహిళా భక్తులు దీపాలు వెలిగిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి కాస్తా భక్తురాలి చీరకు అంటుకోవడంతో ఇద్దరు మహిళా భక్తులు గాయపడ్డారు.
దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన భక్తులు బయటకు పరుగులు తీసారు..ఏమి జరిగిందో తెలియక ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రత్తమైన ఆలయ అధికారులు గాయపడిన ఇద్దరు మహిళలను వెంటనే నర్సాపురం పి హెచ్ సికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు బాధిత మహిళలకు చికిత్స అందించారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
దీంతో వెంటనే ఆమెను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అధికారులు. గాయపడిన ఇద్దరు మహిళలు స్థానికంగా నివాసం ఉంటున్న కృష్ణవేణి( 55), ఈశ్వరమ్మగా అధికారులు గుర్తించారు. వీరిలో కృష్ణవేణి పరిస్థితి విషమం గా ఉండగా.. ఈశ్వరమ్మకు (58 )గాయాలయ్యాయనీ వైద్యలు తెలిపారు. అయితే ప్రమాద విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు గాయపడిన మహిళలను పరామర్శించి చికిత్స వివరాలు తెలుసుకొన్నారు.
మరిన్ని తెలంగాలణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.