Bibipet Mystery Deaths: ఆ మూడు మృతదేహాలపై బలమైన గాయాలు.. ఇంతకీ ఆత్మహత్యలా.. హత్యలా?

|

Dec 27, 2024 | 12:42 PM

మహిళా కానిస్టేబుల్, ఎస్సై, కంప్యూటర్ ఆపరేటర్.. ముగ్గురి నేపథ్యాలు వేర్వేరు. కానీ ఈ ముగ్గురికీ పరిచయాలు ఏర్పడింది బీబీపేట్ లోనే. ఇక్కడి నుంచి ప్రారంభమైన వీరి పరిచయాల పర్వం చివరకు పెద్ద చెరువులో ముగ్గురి మృతదేహాలు తేలేవరకు వెళ్లింది. గంటల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరి డెడ్ బాడీలు బయటకు రావడం, వీరి శరీరాలపై బలమైన గాయాలు ఉండటం.. చెరువు గట్టుపై వీరి వస్తువులన్నీ ఉండటం.. అసలింతకీ ఇవి హత్యలా? ఆత్మహత్యలా? అనే డైలమాలో పడేశాయి..

Bibipet Mystery Deaths: ఆ మూడు మృతదేహాలపై బలమైన గాయాలు.. ఇంతకీ ఆత్మహత్యలా.. హత్యలా?
Kamareddy Mystery Deaths
Follow us on

కామారెడ్డి, డిసెంబర్‌ 27: ఒకే సమయంలో.. ఒకేచోట.. అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువులో ఒక ఎస్‌ఐ, కానిస్టేబుల్, మరో యువకుడు మృతి చెందడం కామారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది. భిక్కనూరు ఎస్‌ఐ సాయికుమార్‌ (32), బీబీపేట పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ శ్రుతి (30), బీబీ పేటకే చెందిన కంప్యూటర్‌ ఆపరేటర్‌ నిఖిల్‌ (29) అనే యువకుడి మృతదేహాలను గురువారం అడ్లూర్‌ ఎల్లారెడ్డి పెద్ద చెరువు నుంచి వెలికి తీశారు. శృతి, నిఖిల్‌ మృత దేహాలు బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత బయటకు తీయగా, గురువారం ఉదయం 8.30 గంటలకు ఎస్సై సాయికుమార్‌ మృతదేహం కూడా అదే చెరువులో దొరికింది. మృతులు ముగ్గురికి చాలాకాలం నుంచి పరిచయం ఉన్నట్లు సమాచారం. అసలు ఈ మూడు మరణాలు కూడా అనుకోకుండా వెలుగులోకి వచ్చాయి.

ఎస్‌ఐ సాయికుమార్‌ ఫోన్‌ స్విచాఫ్‌ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు బుధవారం పోలీస్‌ ఉన్నతాధికారులకు తెలపటంతో, ఆయన మొబైల్‌ సిగ్నల్‌ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టగా.. అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువు వద్ద సాయికుమార్, నిఖిల్‌ చెప్పులు, సెల్‌ఫోన్లు, శ్రుతి మొబైల్‌ కనిపించాయి. ఎస్‌ఐ కారు కూడా చెరువు సమీపంలోనే ఉండడంతో అనుమానంతో గజ ఈతగాళ్లతో చెరువులో గాలించగా మరణాల మిస్టరీ బయటపడింది. దాదాపు 12 గంటల తర్వాత 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. పోస్టుమార్టం రిపోర్టు వస్తేగానీ అసలు సంగతి బయటపడదని ఎస్పీ సింధుశర్మ తెలిపారు.

వీరి మరణంపై జిల్లాలో తీవ్రంగా చర్చ సాగుతోంది. మెదక్‌ జిల్లాకు చెందిన సాయికుమార్‌ది పేద కుటుంబం. కష్టపడి పైకి వచ్చిన ఆయన ఎస్సై ఉద్యోగం తర్వాత 2022లో కర్నూల్‌ జిల్లా నంద్యాలకు చెందిన మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. మహాలక్ష్మి ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి. ఎస్సై సాయికుమార్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక గాంధారి మండలం గుర్జాల్‌ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ శ్రుతిది కూడా సాధారణ స్థాయి కుటుంబమే. 2014లో కానిస్టేబుల్‌గా ఎంపికైన ఆమె గాంధారిలో ఆరేళ్లు, కామారెడ్డిలో ఏడాది పాటు విధులు నిర్వహించింది. గతంలోనే వివాహమై విడాకులు కూడా తీసుకున్న శ్రుతి గత 3 ఏళ్తుడి బీబీపేటలో విధులు నిర్వహిస్తుంది. సాయికుమార్‌ బీబీపేట ఎస్సైగా ఉన్న సమయంలోనే ఆమెతో పరిచయం ఏర్పడిందని, వీరిద్దరూ చనువుగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆయన బదిలీపై భిక్కనూరుకు వెళ్లగా, బీబీపేటకు చెందిన నిఖిల్‌తో శ్రుతికి పరిచయం పెరిగింది. ఈమధ్యే బీబీపేట సొసైటీలో తాత్కాలిక ఉద్యోగిగా చేరిన నిఖిలో వయస్సులో శ్రుతి కంటే చిన్నవాడు. వీరు వివాహం కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ బీబీపేట కేంద్రంగా మొదలైన వీరి పరిచయాల పర్వం.. చివరకు ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. దీంతో వీరి మధ్య నడిచిన వ్యవహారం ఏమిటనేది మిస్టరీగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.