Telangana Assembly: కేసీఆర్ వస్తారా..? అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక

కాళేశ్వరం అంశం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇప్పటికే దీనిపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇవ్వడంతో.. దీన్ని అసెంబ్లీలో పెట్టి చర్చించేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరోవైపు సభలో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అనుతివ్వాలంటున్న బీఆర్ఎస్.. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టకుండా చూడాలని హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో మాజీ సీఎం సభకు రావాలని అధికార పార్టీ డిమాండ్ చేస్తుంటే.. కేసీఆర్‌ సభకు రావాల్సిన అవసరం లేదని వాదిస్తోంది కారు పార్టీ. ఇంతకీ కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? రారా?

Telangana Assembly: కేసీఆర్ వస్తారా..? అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక
Telangana Assembly

Updated on: Aug 31, 2025 | 6:53 AM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇందుకు ప్రధాన కారణంగా కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సభలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడమే. కమిషన్ నివేదికను సభ ముందు ఉంచి సభ్యులందరి అభిప్రాయాలు తీసుకుంటామని ప్రభుత్వం గతంలోనే క్లారిటీ ఇచ్చింది. ఆ తరువాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. పీసీ ఘోష్ కమిషన్‌ ఇచ్చిన నివేదికను ప్రవేశపెట్టి.. మరోసారి కేసీఆర్‌ను టార్గెట్ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఆయన సభకు రావాలని అధికార పార్టీ డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ జరుగుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఒకవేళ కేసీఆర్‌ అసెంబ్లీకి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్టే అన్నారు. కాళేశ్వరంపై గొప్పగా చెప్పిన కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి దీనిపై వివరణ ఇవ్వాలన్నారు. అయితే సభ గౌరవాన్ని కాంగ్రెస్ దిగజార్చిందని.. ఇలాంటి సభకు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదంటోంటి బీఆర్‌ఎస్. రేవంత్ ప్రభుత్వానికి విలువలు లేవన్న మాజీమంత్రి హరీష్‌రావు… వీరికి సమాధానం చెప్పేందుకే తాము సరిపోతామని.. కేసీఆర్ అవసరం లేదని అన్నారు.

కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్‌

అయితే కమిషన్ నివేదికను తీవ్రంగా తప్పుబడుతున్న బీఆర్ఎస్.. కాళేశ్వరంపై తమకు ఈ అంశంపై సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇదే అంశంపై స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. తమపై ఆరోపణలు చేస్తున్నప్పుడు.. వివరణ ఇచ్చేందుకు కూడా అవకాశాలు ఇవ్వాలని కోరుతోంది. మరోవైపు కమిషన్ నివేదిక కోర్టులో నిలబడదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

BRS హయాంలో మాకు ఆ అవకాశం ఇవ్వలేదన్న భట్టి

అయితే అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడేందుకు బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇస్తామన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. వారికి పవర్‌ పాయింట్ ప్రెజెంటేషన్‌కు ఎందుకు అవకాశం ఇవ్వాలన్నారు. తప్పులు చేసినవారికి ఎలా అవకాశం ఇస్తామని ప్రశ్నించారు. మరోవైపు అసెంబ్లీలో ప్రతిపక్షాలు PPT ఇచ్చే సంప్రదాయం లేదని.. BRS హయాంలో తమకు ఆ అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. అప్పుడు లేని సంప్రదాయం ఇప్పుడు ఎలా ఉంటుందన్నారు. కాళేశ్వరం నివేదికపై చర్చ జరగకుండా ఉండేందుకు యూరియా పేరుతో రాజకీయం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. కాళేశ్వరం అంశంలో బీఆర్‌ఎస్ నేతలు తప్పు చేశారు కాబట్టే భయపడుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.

కమిషన్ నివేదిక సభలో పెట్టకుండా చూడాలని హైకోర్టుకు హరీష్‌రావు

కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టొద్దని కోరుతూ హైకోర్టులో మాజీమంత్రి హరీష్‌రావు పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో నివేదిక పెట్టకుండా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరారు. ఒకవేళ అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చించినా తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో ప్రస్తావించారు. అయితే దీనిపై సోమవారం విచారిస్తామని హైకోర్టు తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..