Jubilee Hills By-Election Counting: అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్.. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం..

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై 10 రౌండ్లలో జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత కల్పించారు. సెక్షన్ 144 అమలులో ఉంటుంది.

Jubilee Hills By-Election Counting: అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్.. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం..
Jubilee Hills By Election Counting

Updated on: Nov 14, 2025 | 6:50 AM

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. 42 టేబుల్స్‌పై 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. షేక్‌పేట డివిజన్‌తో మొదలై ఎర్రగడ్డతో కౌంటింగ్ ముగుస్తుంది. ఇప్పటికే ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. బీఆర్ఎస్ కీలక నేతలు ఏజెంట్లుగా ఉండడం గమనార్హం. 186 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు.

కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 250 మంది పోలీసులు భద్రతా విధుల్లో ఉంటారు. అంతేకాకుండా కౌంటింగ్ కేంద్రం పరిధిలో సెక్షన్ 144 అమలులో ఉంటుంది. పోలీసులు ప్రజలను గుంపులుగా రావద్దని హెచ్చరించారు. అలాగే విజయోత్సవ ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జూబ్లీహిల్స్‌లో మొత్తం 1,94,631 ఓట్లు పోలయ్యాయి. డివిజన్ల వారీగా చూస్తే, అత్యధికంగా బోరబండ డివిజన్‌లో 55.92 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా సోమాజిగూడలో 41.99 శాతం నమోదైంది. 34 పోలింగ్ కేంద్రాల్లో 60 శాతానికి పైగా, 192 కేంద్రాల్లో 50 శాతం మందికి పైగా ఓటేశారు. 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైన 226 పోలింగ్ కేంద్రాలే తుది ఫలితాన్ని ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..