
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో మూడు ప్రధాన పార్టీలనూ ఎలక్షన్ మూడ్‌లోకి తీసుకొచ్చింది జూబ్లీ హిల్స్. ఇక రేపో మర్నాడో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఆ తర్వాత బస్తీ మే సవాల్..! ఈ నేపథ్యంలోనే బైపోల్ వార్‌కు గ్రౌండ్ ప్రిపేర్ చేసింది ఎన్నికల సంఘం.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కసరత్తు స్పీడప్ చేసింది ఎన్నికల సంఘం. ఈ ఉప ఎన్నికను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో నియోజకవర్గ తుది ఓటర్ల జాబితా విడుదల చేసింది. తుది జాబితా ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3లక్షల 99వేల మంది ఉన్నారు. ఇందులో పురుషులు 2లక్షల 7వేల 382 మంది, మహిళలు లక్షా 91వేల 593 మంది, ఇతరులు 25 మంది ఉన్నారు. ఇక ఎన్నిక నిర్వహణకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నికకు కేంద్ర పరిశీలకులను నియమించినట్లు ఇటీవల ఈసీ ప్రకటించింది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకే పరిశీలకులను నియమిస్తున్నట్లు వెల్లడించింది. వీరు ప్రధానంగా అభ్యర్థులు చేసే ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక నిఘా పెడతారు. ఈసీ దూకుడుతో మూడు పార్టీలనూ ఎలక్షన్ మూడ్‌లోకి తెచ్చింది జూబ్లీ హిల్స్. జూబ్లీహిల్స్‌కు జరుగుతోంది ఉపఎన్నిక అయినా.. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికపై ఆసక్తి నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఆశించినన్ని సీట్లు దక్కకపోవడంతో.. ఈ ఉపఎన్నికతో నగరంలో తన ఉనికి చాటుకోవాలని చూస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కాపాడుకోవాడానికి వ్యూహాలు రచిస్తోంది. ఇక తుది జాబితా విడుదల కావడంతో త్వరలోనే ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..