Hyderabad: నిమ్స్‌లో ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ అధికారుల మెరుపు దాడులు.. ఎందుకంటే..?
నిమ్స్ ఆసుపత్రిలో ఒక్కసారిగా మూడు కీలక దర్యాప్తు శాఖలు మెరుపు దాడులకు దిగడం సంచలనంగా మారింది. మాజీ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ అక్రమాస్తుల గుట్టు రట్టయిన మరుక్షణమే.. కోట్ల రూపాయల టెండర్ల దందా, రోగులకు పెట్టే తిండిలో నాణ్యతా లోపాలు, మందుల కొనుగోళ్లలో జరిగిన బాగోతాలను వెలికితీసేందుకు ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ అధికారులు రంగంలోకి దిగారు.

హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో తీవ్ర కలకలం రేగింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిమ్స్ మాజీ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన హయాంలో సాగిన బాగోతాలపై దర్యాప్తు ముమ్మరమైంది. ఆసుపత్రి కేంద్రంగా జరిగిన భారీ అక్రమాల మూలాలను వెలికితీసేందుకు ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల అధికారులు సంయుక్తంగా మెరుపు తనిఖీలు చేపట్టారు. మూడు కీలక శాఖలకు చెందిన అధికారులు ఒకేసారి రంగంలోకి దిగడంతో ఆసుపత్రి వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొన్నేళ్లపాటు నిమ్స్‌లో కీలక హోదాలో చక్రం తిప్పిన మాజీ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్, తనకు అత్యంత అనుకూలంగా ఉండే వ్యక్తులను బినామీలుగా పెట్టుకుని భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. ముఖ్యంగా ఆసుపత్రి క్యాంటీన్ టెండర్లు, కోట్ల రూపాయల విలువైన సర్జికల్ స్టోర్స్, మందుల కొనుగోళ్లకు సంబంధించిన కాంట్రాక్టులను నిబంధనలకు విరుద్ధంగా తన అనుచరులకే కట్టబెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో టెండర్ల కేటాయింపు ప్రక్రియ, సంబంధిత రికార్డులు, నోట్ ఫైళ్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
రోగుల ప్రాణాలతో చెలగాటం.. క్యాంటీన్ ఫుడ్‌పై నిఘా
నిమ్స్‌కు వచ్చే నిరుపేద రోగులు, వారి సహాయకులకు అందించే ఆహార నాణ్యతపైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నిమ్స్ క్యాంటీన్‌లో కల్తీ, నాణ్యతా లోపాలు ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. క్యాంటీన్ నిర్వహణ తీరు, పరిశుభ్రతను పరిశీలించడంతో పాటు ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపారు. నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తూ రోగుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారా అనే కోణంలో లోతైన విచారణ జరుపుతున్నారు.
మందులు, సర్జికల్ కొనుగోళ్లపై లోతైన ఆడిట్
మరోవైపు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మెడిసిన్స్, సర్జికల్ సామగ్రి నిల్వలపై సమగ్ర ఆడిట్ చేపట్టారు. మార్కెట్ ధరల కంటే ఎక్కువకు కొనుగోలు చేశారా? అసలు వచ్చిన మందుల స్టాక్ ఎంత? రికార్డుల్లో చూపిస్తున్న లెక్కలు వాస్తవ నిల్వలతో సరిపోలుతున్నాయా? లేదా కాలం చెల్లిన మందులు, నాసిరకం సర్జికల్ సామగ్రి సరఫరా జరిగిందా? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. స్టోర్స్ విభాగంలోని కంప్యూటర్ డేటా, ఇన్వాయిస్‌లు, బిల్లులను సీజ్ చేసి సరిపోల్చుతున్నారు.
ఆధారాల సేకరణ.. తదుపరి చర్యలపై ఉత్కంఠ
నిమ్స్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కేంద్రంగా సాగిన ఈ విస్తృత సోదాల్లో అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. మూడు దర్యాప్తు సంస్థల సంయుక్త తనిఖీలు పూర్తయిన తర్వాత సమగ్ర నివేదిక రూపొందించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా లక్ష్మీ భాస్కర్‌తో పాటు ఆయనకు సహకరించిన ఇతర అధికారులు, బినామీ కాంట్రాక్టర్లపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉండటంతో ఆసుపత్రి వర్గాల్లో తీవ్ర అలజడి మొదలైంది.
