AP News: గృహ నిర్మాణంలో అక్రమాలపై వైసీపీ, జనసేన మధ్య మాటలయుద్ధం

ఏపీ గృహనిర్మాణంలో అవినీతి జరిగిందని పవన్‌ కేంద్రానికి లేఖ రాయడంపై వైసీపీ-జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆరోపణలపై పవన్‌ చర్చకు రావాలని మంత్రి జోగి రమేష్‌ సవాల్‌ విసిరితే..తాము చర్చకు సిద్ధమేనని కౌంటర్‌ ఇచ్చారు జనసేన నేత పోతిన మహేష్‌.

AP News: గృహ నిర్మాణంలో అక్రమాలపై వైసీపీ, జనసేన మధ్య మాటలయుద్ధం
Pothina Mahesh - Jogi Ramesh

Updated on: Dec 31, 2023 | 6:19 PM

ఏపీలో పేదల ఇళ్ల స్థలాల సేకరణ, ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగినట్లు ప్రధాని మోదీకి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ లేఖ రాయటంపై మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. ఆ లేఖలో సీబీఐతో పాటు ఈడీ ఎంక్వైరీ చేయాలని పవన్ కల్యాణ్‌ కోరారు. అసలు జనసేన అధ్యక్షుడు ఏ ఆధారాలతో లేఖ రాశారని జోగి రమేశ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా జోగి రమేశ్ ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలపై వివరాలను వెల్లడించారు. పవన్‌ రాసిన 13 అంశాలపై మీడియా ద్వారా పూర్తి వివరాలతో సమాధానం ఇచ్చారు. ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి జరగలేదన్నారు. పవన్‌ లేవనెత్తిన ప్రతి అంశంపై తాము చర్చకు సిద్ధమేనన్నారు. పేదల ఇళ్లపై కాదు..దమ్ముంటే చంద్రబాబు అవినీతిపై పవన్‌ ప్రధానికి లేఖ రాయాలని సవాల్‌ విసిరారు.

పవన్‌కల్యాణ్‌ కేంద్రానికి లేఖ రాయడంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందని విమర్శించారు జనసేన నేత పోతిన వెంకట మహేష్‌. అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దోపిడీకి కొత్త పాలసీనే ఈ ఇళ్ల నిర్మాణమన్నారు. సెంట్‌ భూమి కింద ఇళ్లు నిర్మించే పథకం పేరుతో 35వేల కోట్లు లూఠీ చేశారని ఆరోపించారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని జగన్, జోగి రమేష్‌కు సవాల్ విసిరారు. మొత్తానికి పవన్‌లేఖ వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. వైసీపీ-జనసేన నేతల సవాళ్లపర్వం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..