
జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ బోగ శ్రావణి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సమక్షంలో శ్రావణితో పాటు పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో జగిత్యాలకు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి బీజేపీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీలో చేరిన అనంతరం శ్రావణి మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీలో తనను అణచివేశారని.. తన ఎదుగుదలను ఓర్చుకోలేక పోయారని ఆరోపించారు. కన్నీరు పెట్టుకుని బయటకు వచ్చినా తనను బీఆర్ఎస్ అధిష్టానం ఓదార్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మాభిమానంతోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని అన్నారు. బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.
రాష్ట్రంలో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాయినింగ్స్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. మరోవైపు శ్రావణి చేరికతో జగిత్యాల జిల్లాలో పార్టీ మరింత బలోపేతం కానుందని అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం