
దేవుడు ఆదేశించిండు.. నేను ఇట్లా నడుచుకుంటూ వచ్చిన.. నీకు లక్ష రూపాయలు సాయం చేసిన.. ఇది హీరో రజనీకాంత్ డైలాగ్ కాదు..టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సోడా అమ్మే మహిళతో చెప్పిన మాటలు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సదాశివపేటలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం సదాశివపేట పట్టణంలో పర్యటించారు. ఆయన కారు దిగి వెళ్తుండగా నిమ్మ సోడా అమ్మే బండి కనిపించింది. ఆయన అక్కడ ఆగారు. నిమ్మకాయ సోడా తాగుతూ ఆ బండిని నడుపుతున్న మహిళతో ముచ్చటించారు.“ఏమ్మా ఎట్లా ఉంది వ్యాపారం.. మంచిగా జరుగుతోందా” అని అడిగారు. “ కొత్త మెషిన్ కొనుక్కుంటే సోడాల గిరాకీ ఎక్కువవుతుంది. ఇప్పుడు చేస్తున్న వ్యాపారంలో ఏమీ మిగలడం లేదు. మీరు ఏదైనా సాయం చేస్తే బండి మంచిగా నడుపుకుంటాం” అంటూ ఆ మహిళ చెప్పింది. “ఎన్ని డబ్బులు ఇస్తే సోడా మిషన్ వస్తుంది? మీరు మంచిగా బతకగలుగుతారు? అని జగ్గారెడ్డి అడిగారు…లక్ష రూపాయలు పెడితే కొత్త మిషన్ వస్తుంది. ఈ ఎండాకాలంలో రోజుకు మూడు వేల రూపాయల దాకా వ్యాపారం అవుతుంది. మీరు సాయం చేస్తే మంచిగా బతుకుతం” అంటూ ఆ మహిళ బదులిచ్చింది. వెంటనే జేబులోంచి లక్ష రూపాయలు తీసిన జగ్గారెడ్డి.. “ ఇదిగో ఈ లక్ష రూపాయలు తీసుకో.. ఎండాకాలం వచ్చేలోగా సోడాల మిషన్ కొనుక్కో. రోజుకు మూడు వేలు సంపాదించు” అంటూ ఆమెకు లక్ష రూపాయలు అందించారు. అప్పటికప్పుడే లక్ష రూపాయలు ఇస్తాడని ఊహించని ఆ మహిళ.. “అయ్యో సార్.. ఇప్పుడే ఇచ్చేస్తున్నారా” అంటూ సంతోషపడ్డది. జగ్గారెడ్డికి నమస్కరించింది. ఈ లక్ష రూపాయలతో మీరు బాగుపడాలి మంచిగా వ్యాపారం జరగాలి అంటూ చెప్పి జగ్గారెడ్డి అక్కడి నుంచి ముందుకు వెళ్లారు..