Villagers Plant Paddy on Poorly Roads: వర్షాకాలం మొదలైంది. రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి. పల్లెల్లో మట్టి రోడ్లతో అవస్థలు మొదలయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓ గ్రామంలో స్థానికులు వినూత్నంగా నిరసన తెలిపారు. రోడ్డుపై నాట్లు వేసి ఆందోళన చేపట్టారు. ఇకనైనా మా గోడు ఆలకించండి సారూ.. అంటూ మొరపెట్టుకున్నారు
వర్షాకాలం ప్రారంభంతో పల్లెల్లో రైతులంతా పొలం బాట పట్టారు. పొలం చదును చేసి నాట్లు వేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇదంతా నాణేనికి ఒకవైపే.. మరోవైపు చూస్తే పల్లెల్లో అవస్థలే కనిపిస్తాయి. సరిగా నడవడానికి కూడా పనికిరాని రోడ్లతో ఇబ్బందులు పడుతుంటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. దీంతో వాళ్లు వినూత్నంగా నిరసన తెలిపారు.
మల్హర్రావు మండలం రుద్రారం గ్రామపంచాయతీ పరిధిలోని నాలుగు, ఏడవ వార్డులో చిన్న వర్షం కురవడంతోనే రోడ్లన్నీ బురదమయంగా మారాయి. మట్టిరోడ్డంతా బురద, బురదగా మారి.. అధ్వానంగా తయారయింది. కాలు తీసి.. కాలు పెట్టలేని పరిస్థితి. తమ కాలనీలో పరిస్థితులపై.. అధికారులు, నాయకులకు అనేక సార్లు మొరపెట్టుకున్నారు. అయినా పట్టించుకున్న నాధుడు లేడు. దీంతో విసిగిపోయిన స్థానికులు వినూత్నంగా నిరసన తెలిపారు. రోడ్లపై ఉన్న బురదలో నాట్లు వేసి ఆందోళన చేపట్టారు.
గ్రామంలో దాదాపు అన్ని రోడ్లు ఇలాగే ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సిసి రోడ్లు ఏర్పాటు చేసి వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుండా చూడాలని కాలనీ వాసులు కోరుతున్నారు. మరోవైపు ఇళ్ల ముందు ఇలా వర్షం నీరు నిల్చోవడంతో.. దోమలు వ్యాపించి అనేక రోగాలకు కారణమవుతున్నాయని.. ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని రహదారులను బాగుచేయాలని వేడుకుంటున్నారు.