Bhadrachalam: అంతులేని ఆవేదన.. గోదావరి మిగిల్చిన వేదన.. వరద తగ్గినప్పటికీ

|

Jul 21, 2022 | 12:51 PM

ఉగ్రరూపం దాల్చిన గోదావరి అపార నష్టాన్ని మిగిల్చింది. వరదలతో విరుచుకుపడిన నది.. పరివాహక ప్రాంతాలను నిండా ముంచేసింది. ఇళ్లు, పొలాలను ఏకం చేస్తూ తనలో కలిపేసుకుంది. వారం రోజులుగా తీవ్ర రూపం దాల్చుతున్న గోదావరి....

Bhadrachalam: అంతులేని ఆవేదన.. గోదావరి మిగిల్చిన వేదన.. వరద తగ్గినప్పటికీ
Floods
Follow us on

ఉగ్రరూపం దాల్చిన గోదావరి అపార నష్టాన్ని మిగిల్చింది. వరదలతో విరుచుకుపడిన నది.. పరివాహక ప్రాంతాలను నిండా ముంచేసింది. ఇళ్లు, పొలాలను ఏకం చేస్తూ తనలో కలిపేసుకుంది. వారం రోజులుగా తీవ్ర రూపం దాల్చుతున్న గోదావరి (Godavari) ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. వరద ముంచెత్తడంతో ఇంటిని వదిలేసి, కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు వెళ్లిన బాధితులు తిరిగి ఇంటికొచ్చాక పరిస్థితిని చూసి బావూరుమంటున్నారు. ఇంటి పరిసరాలను, సామగ్రిని శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రహదారులపై పేరుకున్న బురద ప్రమాదాలకు కారణమవుతున్నాయి. భద్రాచలం (Bhadrachalam) రామాలయం పరిసరాల్లో వరద నీరు తగ్గుతోంది. ప్రత్యేక మోటార్లుతో నీటిని తోడుతున్నారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాలు ముంపునకు గురయ్యాయి. వరద ప్రభావానికి గురైన బాధితులను గుర్తించే పనిలో అధికారులు సర్వే చేస్తున్నారు. అసలైన లబ్ధిదారులను తేల్చడంలో గందరగోళానికి గురవుతున్నారు.

కాగా.. బుధవారం ఉదయం గోదావరి వరద 47.9 అడుగులుగా ఉంది. అయినప్పటికీ అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి ఇంకొంత వరద వస్తుందనే సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం రాత్రి 11 గంటలకు 48.60 అడుగులకు పెరిగింది. దీంతో స్థానికులు మరోసారి వరద వస్తుందేమోనని భయాందోళనకు గురవుతున్నారు. వరద ముప్పు తగ్గుతుండగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం పట్టణం సగం వరకు నీటిలో మునిగిపోయింది. వరద తగ్గుతుండటంతో ప్రతి చోటా బురద పేరుకుపోయింది.

వరదలతో పాములు, తేళ్లు కొట్టుకొచ్చి రోడ్లపై తిరుగుతున్నాయి. వరద తగ్గాక ఇవి ఇళ్లల్లోకి చేరే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ట్రాన్స్‌కోకు చెందిన స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నీటిలో మునగిపోవడంతో అంధకారం నెలకొంది. రోడ్లు ధ్వంసమవడంతో రవాణా కష్టతరంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి