Heavy rains: తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆగస్టు 27, 28 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఈ ఆవర్తనం కొనసాగుతుందని చెప్పారు. ఇది సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తున విస్తరించి ఉందని.. దీని ప్రభావంతో అటు, దక్షిణ అంతర్గత తమిళనాడు పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు మరో ఆవర్తనం విస్తరించి ఉందని.. వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రెండింటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉందని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు నమోదవుతున్నా.. రానున్న రోజుల్లో రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు నమోదవుతాయని సూచిస్తున్నారు వాతావరణశాఖ అధికారులు. రాయలసీమతో పాటు, కోస్తాంధ్ర జిల్లాలు పశ్చిమ గోదావరి, కృష్ణా, ఏలూరుజిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇటు తెలంగాణలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుందని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడక్లిక్ చేయండి