Weather: వర్షాలే వర్షాలు.. తెలంగాణలోని ఆ జిల్లాలకు ఉరుములు, మెరుపులతో వడగళ్ల వాన.. తాజా రిపోర్ట్

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది.

Weather: వర్షాలే వర్షాలు.. తెలంగాణలోని ఆ జిల్లాలకు ఉరుములు, మెరుపులతో వడగళ్ల వాన.. తాజా రిపోర్ట్
Rain Alert To Hyderabad

Updated on: Apr 02, 2025 | 8:58 AM

మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. మధ్య మహారాష్ట్ర దాని సమీప ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరీన్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఇవాళ(బుధవారం) రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

బుధవారం తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు కురవనుండగా.. వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు.

ఆవర్తనం, ద్రోణి ప్రభావం ఉన్నప్పటికీ తెలంగాణలోని కొన్ని జిల్లాలలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం గరిష్టంగా ఆదిలాబాద్‌లో 41 కనిష్టంగా రామగుండంలో 35.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మంగళవారం తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, భద్రాచలం, రామగుండం, హైదరాబాద్, ఖమ్మం, రామగుండం, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయింది.