Governor Tamilisai: ఆసుపత్రుల్లో వైద్యసదుపాయాలను మెరుగుపర్చాలి.. ఇబ్రహీంపట్నం బాధితులను పరామర్శించిన గవర్నర్..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న నలుగురు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 30 మంది ఇన్ఫెక్షన్‌తో నిమ్స్, ఆపోలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Governor Tamilisai: ఆసుపత్రుల్లో వైద్యసదుపాయాలను మెరుగుపర్చాలి.. ఇబ్రహీంపట్నం బాధితులను పరామర్శించిన గవర్నర్..
Tamilisai Soundararajan

Updated on: Sep 04, 2022 | 12:39 PM

Ibrahimpatnam Family planning operation Failed incident: తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రులకు వచ్చే రోగుల ప్రాణాలను కాపాడాలని సూచించారు. కాగా.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న నలుగురు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 30 మంది ఇన్ఫెక్షన్‌తో నిమ్స్, ఆపోలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను గవర్నర్ తమిళిసై పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో గవర్నర్ మాట్లాడి.. పలు విషయాలను తెలుసుకున్నారు. అనంతరం తమిళిసై మీడియాతో మాట్లాడారు. చికిత్స పొందుతున్న మహిళలకు మనో ధైర్యం కల్పించేందుకు ఆసుపత్రికి వచ్చినట్లు గవర్నర్ పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులకు మంచి చికిత్స అందించాలని తాను మొదటి నుంచి చెబుతున్నానని గవర్నర్ పేర్కొన్నారు. ఆపరేషన్లు వికటించి నలుగురు చనిపోవడం బాధాకరమన్నారు. నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల మెరుగు కోసం ప్రభుత్వానికి కూడా లేఖ రాస్తానని గవర్నర్ తమిళిసై పేర్నొ్నారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న వారిలో ఒకరిద్దరు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్నారు.

కాగా.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయి. అనంతరం ఇన్ ఫెక్షన్‌కు గురై మూడు రోజుల వ్యవధిలో నలుగురు మహిళలు మృతి చెందారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం మిగతా 30 మందిని నిమ్స్, అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తోంది. ఈ ఘటనపై కమిటీని వేయడంతోపాటు.. ఆసుపత్రి సూపరింటెండెంట్ సస్పెండ్ చేసింది. దీంతోపాటు వైద్యుల లైసెన్స్ ను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది.