
హైదరాబాద్ మరో మల్టీ లెవెల్ పార్కింగ్ సదుపాయం…నాంపల్లి ప్రాంతంలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ఆధ్వర్యంలో నిర్మించిన అత్యాధునిక మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే అత్యంత ఆధునికంగా రూపొందించిన ఈ పార్కింగ్ కేంద్రంలో మొత్తం 10 అంతస్తుల్లో 250 కార్లను నిలిపే సామర్థ్యం ఉంది. నాంపల్లి నుమాయిష్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
నాంపల్లి మల్టీ లెవల్ పార్కింగ్‌లో మొదటి గంటకు కారుకు రూ.35 పార్కింగ్ ఫీజును నిర్ణయించినట్లు హెచ్‌ఎంఆర్‌ఎల్ ప్రకటించింది. ప్రతి అదనపు గంటకు ఫీజు పెరుగుతూ ఉంటుంది. ఈ పార్కింగ్ కేంద్రం మూడు బేస్‌మెంట్‌లు, ఏడు పై అంతస్తులతో నిర్మించబడింది. ఈ సదుపాయంలో జర్మనీకి చెందిన అత్యాధునిక PALIS ఆటోమేటెడ్ పార్కింగ్ సిస్టమ్‌ను అమర్చారు. డ్రాప్-ఆఫ్ ఏరియాలో వాహనం ఉంచిన తర్వాత, స్మార్ట్ కార్డు సహాయంతో పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో వాహనం పార్కింగ్‌కు తరలించబడుతుంది. ఇందులో ఎలాంటి మానవ జోక్యం లేకుండా వాహనాల పార్కింగ్, రిట్రీవల్ జరుగుతుంది.
వాహనాన్ని తిరిగి పొందాలంటే ముందుగా ఎయిర్ కండిషన్‌డ్ పాయింట్ ఆఫ్ సేల్ కార్యాలయంలో పార్కింగ్ ఫీజును చెల్లించాలి. అనంతరం స్మార్ట్ కార్డు ఉపయోగించి వాహనం రిట్రీవ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. ఈ ఆధునిక పార్కింగ్ విధానం నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు. నాంపల్లి మల్టీ లెవల్ పార్కింగ్‌లో కార్లకు గంటల వారీగా పార్కింగ్ ఛార్జీలు ఇలా ఉన్నాయి. మొదటి గంటకు రూ.35, రెండు గంటలకు రూ.70, మూడు గంటలకు రూ.105, నాలుగు గంటలకు రూ.140, ఐదు గంటలకు రూ.175, ఆరు గంటలకు రూ.210, ఏడు గంటలకు రూ.245, ఎనిమిది గంటలకు రూ.280, తొమ్మిది గంటలకు రూ.315, పది గంటలకు రూ.350గా నిర్ణయించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి…