Hyderabad: యూసుఫ్‌గూడ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ గుండెపోటుతో మృతి

|

Dec 30, 2024 | 9:39 AM

తెలంగాణ పోలీస్ శాఖకు ఏమైందో అర్ధంకాకున్నది. ఈ శాఖలో గత కొంత కాలంగా వరుస మరణాలు సంభవిస్తున్నాయి. అధిక మంది ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తున్నారు. తాజాగా ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూసఫ్ గూడకు చెందిన బెటాలియన్ సిబ్బంది ఒకరు గుండెపోటుతో కుప్పకూలారు. వివరాల్లోకెళ్తే..

Hyderabad: యూసుఫ్‌గూడ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ గుండెపోటుతో మృతి
Heart Attack
Follow us on

జూబ్లీహిల్స్‌, డిసెంబర్‌ 30:  గత కొంత కాలంగా తెలంగాణ పోలీస్ శాఖలో సిబ్బంది వరుస ఆత్మహత్యలతో మృతి చెందుతున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ఆదివారం ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. విషం తాగి ఒకరు, ఉరేసుకుని మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధ తాళలేక కుటుంబంతో కలిసి ఏఆర్‌ కానిస్టేబుల్‌ బాలకృష్ణ ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబానికి విషం ఇచ్చి, తాను మాత్రం ఉరి వేసుకున్నాడు. దీంతో బాలకృష్ణ మృతి చెందాడు.. ఆయన కుటుంబం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుంది. ఇక కొల్చారం పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కాటూరి సాయికుమార్‌ (55) స్టేషన్‌ ఆవరణలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రెండు ఘటనలు మరువక ముందే తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది.

యూసుఫ్‌గూడ ఫస్ట్‌ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ దోసపాటి బాలరాజు (45) గుండెపోటుతో మృతి చెందారు. 2012 బ్యాచ్‌కు చెందిన బాలరాజు బెటాలియన్‌లోని ఆర్మ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అథారిటీ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో తన స్వస్థలమైన భువనగిరికి సెలవుపై వెళ్లాడు. అక్కడే ఇంటి వద్ద గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక దవాఖానకు తరలించి, ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నగరంలోని దవాఖానకు తరలిస్తుండగా దారి మధ్యలోనే మృతి చెందారు. ఈ మేరకు బెటాలియన్‌ అధికారులు తెలిపారు. బాలరాజు మృతితో బెటాలియన్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

3 రోజుల కిందట కామారెడ్డి జిల్లాకు చెందిన ఎస్సై సాయికుమార్‌ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా రాష్ట్రంలో పోలీస్‌ శాఖలోని పలువురు అధికారులు ఒకరి తర్వాత ఒకరుగా ఆత్మహత్యలు చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.