
హైదరాబాద్, అక్టోబర్ 29: మసాజ్ సెంటర్ పేరుతో ఉద్యోగులకు ఎరవేశాడు.. ఎక్కువ జీతం ఇస్తానంటూ మహిళలను ఉద్యోగంలోకి తీసుకున్నాడు.. ఎక్కువ జీతం వస్తుందన్నే ఆశతో ఉద్యోగంలోకి చేరిన మహిళలను వేధించడం మొదలుపెట్టాడు. మసాజ్ సెంటర్‌కు వచ్చే పురుషులకు అనువుగా వ్యవహరించాలంటూ ఒత్తిడి చేశాడు.. వారితో సఖ్యతగా ఉండాలని.. వారు చెప్పినట్లు చేయాలని ఒత్తిడి చేయడంతో ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడకు చెందిన ఓ మహిళ పంజాగుట్టలోని ఓ మసాజ్ సెంటర్‌లో ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉద్యోగంలో చేరింది. లక్షరూపాయలు జీతానికి జాబ్‌లో చేరిన మహిళకు అసలు విషయం బోధపడింది.
మహిళలను ఉద్యోగం పేరుతో మసాజ్ సెంటర్‌లో చేర్చుకొని అసాంఘిక కార్యకలాపాలకు ప్రోత్సహిస్తున్నట్టు గ్రహించింది. ఉద్యోగంలో చేరిన 20 రోజులకు యజమాని ఒత్తిడి మొదలైంది. మసాజ్ సెంటర్‌కి వచ్చే పురుషులకు అనుకూలంగా నడుచుకోవాలని.. అసాంఘిక కార్యకలాపాలు చేయాలంటూ ఒత్తిడిచేయడం మొదలు పెట్టాడు. మహిళ అందుకు అంగీకరించకపోవడంతో బెదిరింపులకు దిగాడు. దాంతో చేసేది లేక మహిళ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదుతో మసాజ్ సెంటర్ యజమానిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
కాగా.. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో కలకలం రేపింది. ఇదే తరహాలో పలు మసాజ్ సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇదివరకు కూడా అసాంఘిక కలాపాలకు పాల్పడుతున్న మసాజ్ సెంటర్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..