Hyderabad: ‘కన్నా నువ్వు లేని ఈ లోకంలో నాకేం పని’.. ప్రాణంగా ప్రేమించే భర్త మరణాన్ని భరించలేక

|

May 25, 2023 | 3:34 PM

వారికి పెళ్లయి ఏడాదిన్నరే. కానీ అది జన్మజన్మల బంధంలా అనిపించింది. వారిద్దరికీ ఒకరంటే ఒకరు ప్రాణం. హ్యాపీగా అమెరికాలో ఉంటూ దాంపత్య జీవితాన్ని సాగిస్తున్నారు. విదేశాల్లో ఉంటూ తల్లిదండ్రులు కూడా గుర్తుకు రానంత గొప్పగా అతడు ఆమెను చూసుకున్నాడు. కానీ ఊహించని కుదుపు. హార్ట్ స్ట్రోక్‌తో అకస్మాత్తుగా భర్త మృతి చెందాడు. దీంతో భార్య....

Hyderabad: కన్నా నువ్వు లేని ఈ లోకంలో నాకేం పని.. ప్రాణంగా ప్రేమించే భర్త మరణాన్ని భరించలేక
Manoj Sahithi Couple
Follow us on

ఏడాదిన్నర క్రితమే ఆమెకు పెళ్లయ్యింది. భర్త అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఇద్దరూ అక్కడే సెటిల్ అయ్యారు. ఒకరంటే ఒకరికి ఎంతో అన్యోన్యత ఏర్పడింది. ఆ చూడముచ్చటైన జంటను చూసి విధికి కన్నుకుట్టిందో ఏమో.. భర్తను హార్ట్ అటాక్ రూపంలో ఈ లోకం నుంచి తీసుకెళ్లిపోయింది. తనకు జీవితాంతం తోడుంటాడని భావించిన భర్త ఇక లేడు అన్న వార్తను ఆమె జీర్ణించుకోలేకపోయింది. అతడు లేని ఈ లోకంలో అనుక్షణం ఆమెకు నరకంలా అనిపించింది. ఆ వేదనను తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  హైదరాబాద్‌లో ఈ విషాద ఘటన వెలుగుచూసింది.

29 సంవత్సరాల సాహితికి ఒకటిన్నర సంవత్సరాల క్రితం వనస్థలిపురంకి చెందిన మనోజ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో వివాహం జరిగింది. వారిద్దరూ అమెరికా (Dallas, Frisco) లో నివాసముంటున్నారు. ఈనెల రెండున సాహితి డీడీ కాలనీలో ఉండే తన తల్లితండ్రులను చూడడటానికి ఇండియాకు వచ్చింది. అయితే 20వ తేదీన సాహితి భర్త మనోజ్ అమెరికాలో హార్ట్‌ స్ట్రోక్‌తో హఠాన్మరణం చెందాడు. అతడి మృతదేహం 23వ తేదీన ఇండియాకు వచ్చింది. అశ్రునయనాల మధ్య 24వ తేదీన వనస్థలిపురంలో మనోజ్ అంత్యక్రియలు జరిగాయి. అనంతరం సాహితి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తన తల్లితండ్రులతో డీడీ కాలనీలోని ఇంటికి వచ్చింది. రాత్రి సాహితి, ఆమె చెల్లెలు సంజన కలిసి ఒకే రూమ్‌లో పడుకున్నారు. గురువారం ఉదయం 09:20 గంటల సమయంలో సంజన వాష్ రూమ్‌‌కి బయటకు వెళ్లి 10 నిమిషాల్లో తిరిగి వచ్చింది. అప్పటికే లోపల నుంచి గడియపెట్టి ఉంది. ఎంత పిలిచినా లోపలి నుంచి రెస్పాన్స్ లేదు.  అనుమానంతో తలుపు బద్దలుకొట్టి చూడగా.. చీరతో ఫ్యాన్‌కి ఉరివేసుకుంది సాహితి. సమాచారం అందుకున్న పోలీసులు.. స్పాట్‌కు చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.  కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.