Virus: వై దిస్ వైరస్ వర్రీ.. అమ్మబాబోయ్.! పెట్రేగిపోతున్న మాయదారి రోగాలు

|

Jan 08, 2025 | 10:10 PM

కరోనా కల్లోలాన్ని మర్చిపోలేదెవరూ. జీవితాంతం వెంటాడే పీడకల ఆ మహమ్మారి. అందుకే కొత్తగా ఏ వైరస్‌ పేరు విన్నా.. ప్రపంచం ఉలిక్కిపడుతోంది. ఈ సీజన్‌లో ఎవరి నోట విన్నా హ్యూమన్‌ మెటా న్యూమో వైరస్‌ మాటే. మరోవైపు మనం ఎప్పుడో చూసిన నోరో వైరస్‌ ఇప్పుడు అగ్రరాజ్యాన్ని భయపెడుతోంది. పశుపక్ష్యాదులకే పరిమితమనుకున్న బర్డ్‌ ఫ్లూ అమెరికాలో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఏమిటీ మాయరోగాలు? మనిషి రోగ నిరోధక సామర్థ్యం తగ్గుతోందా? మాయదారి క్రిముల కోరలు పదునెక్కుతున్నాయా?

Virus: వై దిస్ వైరస్ వర్రీ.. అమ్మబాబోయ్.! పెట్రేగిపోతున్న మాయదారి రోగాలు
Virus
Follow us on

వైరస్‌ పుట్టినిల్లు చైనాలో మరో మహమ్మారి జడలు విప్పింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న HMP వైరస్‌.. ఇండియాని కూడా టచ్‌ చేసింది. అమెరికా నుంచి మహారాష్ట్ర దాకా బర్డ్ ఫ్లూ కేసులు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. హ్యూమన్‌ మెటా న్యూమో ప్రాణాంతకం కాదంటూనే.. బీకేర్‌ఫుల్‌ అంటున్నారు డాక్టర్లు. స్టాక్‌ మార్కెట్లను కూడా షేక్‌ చేస్తున్న వైరస్‌లకు విరుగుడేది?

అసలే.. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రపంచం. అందుకే ఇప్పుడు తుమ్మినా దగ్గినా భయం. రోగనిరోధక శక్తి తక్కువుంటేనో, సీజన్‌ మారితేనో.. చిన్నాచితకా అనారోగ్య సమస్యలు కామన్‌. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నాలుగురోజుల్లో అంతా నార్మల్‌. కానీ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన తర్వాత ఇప్పుడు కాస్త పడిశం పట్టినా, గొంతు గరగరమన్నా గుండెల్లో దడే. కడుపులో కాస్త మందంగా అనిపిస్తే ఒకప్పుడు ఓ పూట పత్యంచేస్తే సెట్టయ్యేది. కానీ ఇప్పుడు ఏ దిక్కుమాలిన వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిందోనని అనుమానం హార్ట్‌బీట్‌ పెంచేస్తోంది. ఏం చేస్తాం మరి.. మళ్లీ వచ్చిపడుతున్నాయ్‌ మాయరోగాలు.

చైనాకు రోగమొచ్చింది. ప్రపంచమంతా వణికిపోతోంది. కేసుల ఊసులేదు. ఊహాజనిత ప్రచారాలే తప్ప అధికారికంగా మరణాల సంఖ్య కూడా తెలీదు. చైనాలో మెడికల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారంటూ అనధికార వార్తలు. HMPV..హ్యూమన్‌ మెటా న్యూమో వైరస్‌. కరోనాకి కజిన్‌లాంటిదే ఈ వైరస్‌ కూడా. కరోనా ప్రపంచాన్ని కుదిపేసింది. లక్షల ప్రాణాలను గాల్లో కలిపేసింది. మరి హెచ్‌ఎంపీవీ కూడా అంతే ప్రమాదమా అంటే అవునని చెప్పలేం. ప్రాణాంతకం కాదని కొట్టిపారేయలేం. ఎందుకంటే కరోనా సీజన్‌లో భయమే మనిషిని చంపేసింది. కరోనా వేరియంట్లలాగే హెచ్‌ఎంపీ వైరస్‌ టార్గెట్‌.. మన శరీరంలోని ఊపరితిత్తులే. అసలే కరోనా ప్రభావంతో లంగ్స్‌ వీకైపోయాయి. ఈ టైంలో కొత్త వైరస్‌ ఎఫెక్ట్‌పడితే ఏం జరుగుతోందనని భయం.

ఓపక్క వైరస్‌ల పుట్టినింట్లో HMPV కల్లోలం సృష్టిస్తోందన్న ప్రచారం జరుగుతున్న సమయంలోనే.. అగ్రరాజ్యంలో నోరో వైరస్‌ వణికిస్తోంది. మరోవైపు పక్షులు, పశువులకే పరిమితమనుకునే బర్డ్‌ఫ్లూతో అమెరికాలో తొలిసారి ఒకరు మృత్యువాత పడ్డారు. అడవి పక్షులకు దగ్గరగా వెళ్లడంతో హెచ్‌5ఎన్‌1 సోకి ప్రాణాలు కోల్పోయాడు 65ఏళ్ల వ్యక్తి. వాస్తవానికి కరోనా తర్వాత ప్రపంచమంతా అంతగా చర్చ జరుగుతోంది హెచ్‌ఎంపీ వైరస్‌ గురించే. ఎక్కువగా చిన్నపిల్లలు, వృద్ధులు ఈ వైరస్‌ బారినపడుతున్నట్లు కథనాలొస్తున్నాయి. శీతాకాలం అంటువ్యాధులు త్వరగా ప్రబలుతుంటాయి. జలుబు, జ్వరం, దగ్గు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఈ సీజన్‌లో సర్వసాధారణం. చాలామంది వీటికి ఏ టాబ్లెట్టో వేసుకుని ఉపశమనం పొందుతుంటారు. కానీ ఇప్పుడు కొంపదీసి కొత్త వైరస్సేమో అనే భయంతో ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులపై HMP వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పెద్దగా భయపడాల్సిన పన్లేదన్న మాట బలంగా వినిపిస్తున్నా.. కోవిడ్‌ 19కంటే తక్కువ ప్రమాదమేం కాదన్న వాదనకూడా వినిపిస్తోంది. ప్రస్తుతానికైనా ఈ వైరస్‌కి వ్యాక్సిన్‌ లేదు. అలాగని ఇదేం ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన వైరస్ కాదు. 20ఏళ్ల కిందటే హెచ్‌ఎంపీవీని కనుగొన్నారు. 2011-2012లోనే యూఎస్‌, కెనడా, యూరప్‌లో HMPVకేసులు నమోదయ్యాయి. ఎప్పుడూ వచ్చిపోయే జలుబు, దగ్గు, జ్వరం ఈ వైరస్‌ లక్షణాలు. జనరల్‌ మెడిసన్‌తో ఇంట్లోనే చికిత్స తీసుకుంటే సరిపోతుందంటున్నారు వైద్యనిపుణులు. సేమ్‌టైమ్‌ ప్రాణాంతకం కాకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిందేనంటున్నారు. ఎందుకంటే HMPV పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు అలర్ట్‌ అయ్యాయి.

కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రలో హ్యూమన్‌ మెటా న్యూమో వైరస్‌ కేసులు నమోదయ్యాయి. అయితే బాధితులంతా మూడు నెలల నుంచి 13 ఏళ్లలోపు పిల్లలే. దీంతో కేంద్రం కూడా రాష్ట్రాలను అప్రమత్తంచేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ముందు జాగ్రత్తగా ఐసొలేషన్‌ వార్డులు ఏర్పాటవుతున్నాయి. వైరస్‌ వ్యాప్తిని పర్యవేక్షించడానికి కొన్ని రాష్ట్రాలు కమిటీలు ఏర్పాటుచేస్తున్నాయి. అయితే హెచ్‌ఎంపీ కిల్లర్ వైరస్ కాదంటోంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా. ఈ వైరస్‌ కేసులపై డబ్ల్యూహెచ్‌వోతో కేంద్ర సర్కారు సంప్రదింపులు జరుపుతోంది. పొరుగుదేశాల్లో ముఖ్యంగా చైనాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి. కోవిడ్‌లాగా ప్రాణాంతకమైతే కాదు. కాకపోతే తేలిగ్గా తీసుకోకుండా కాస్త అలర్ట్‌గా ఉంటే చాలు. దాదాపు వైద్యనిపుణులంతా కొత్త వైరస్‌పై ఇదే మాట చెబుతున్నారు. ఎందుకంటే హెచ్ఎంపీవీ సాధారణ వైరస్, పైగా ఇది దశాబ్దాల పురాతనమైంది. ఈ వైరస్ కనీసం 60 సంవత్సరాలుగా ఉనికిలో ఉందంటున్నారు వైద్యనిపుణులు. హెచ్ఎంపీవీ వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ సుమారు ఐదారు రోజులు ఉంటుంది. HMP వైరస్ లక్షణాలు ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయి. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. వైరస్ తీవ్రత ఎక్కువైతే బ్రాంకైటిస్, న్యుమోనియాకు దారితీయవచ్చు. లక్షణాలు బయటికి కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది. వేరే అనారోగ్య సమస్యలేవీ లేనివారు 2 నుంచి 5 రోజుల్లో కోలుకుంటారు.

HMP వైరస్‌ ప్రచారంతోనే జనం ఉక్కిరిబిక్కిరవుతుంటే.. మరోవైపు నోరో వైరస్‌ విజృంభిస్తోందన్న వార్తలు మరింత భయపెడుతున్నాయి. అమెరికాలో నోరో వైరస్ రోజురోజుకీ తీవ్రమవుతోంది. యూఎస్‌ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం ఆ దేశంలో నోరో వైరస్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. నవంబరు నుంచీ అగ్రరాజ్యంలో ఆ వైరస్‌ బాధితులు పెరుగుతున్నారు. నోరో వైరస్ జీర్ణకోశానికి సోకే వ్యాధి. బాధితులనుంచి నోరో వైరస్ ఇతరులకు వేగంగా సోకే అవకాశముంది. 12నుంచి 48 గంటల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. అతిసారం, వాంతులు, వికారం, కడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి, బాడీ పెయిన్స్‌ ఉంటాయి. వైరస్‌ సోకిన రెండు రోజులపాటు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తర్వాత తగ్గుముఖం పడుతుంది. నోరో వైరస్‌ కూడా కొత్తదేం కాదు. అమెరికాకి ఇప్పుడు సోకింది కాబట్టే ప్రపంచం ఉలిక్కిపడుతోందంతే. గతంలోనే తెలుగురాష్ట్రాల్లో ఈ వైరస్‌ లక్షణాలపై ప్రజలను ప్రభుత్వాలు అప్రమత్తం చేశాయి. ఆరునెలల క్రితమే హైదరాబాద్‌లో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. పాతబస్తీలో తొందరగా వ్యాప్తిచెందిన నోరో వైరస్‌పై అప్పట్లో జీహెచ్‌ఎంసీ ప్రజలను అప్రమత్తంచేసింది. వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల జాబితాలోనే నోరో వైరస్‌ కూడా ఉంది. పారిశుద్ధ్యం, కలుషిత ఆహారంతోనే ఈ వైరస్‌ వ్యాప్తిచెందుతుందని గుర్తించారు. ముఖ్యంగా ఈ వైరస్ మధ్య వయస్కులు, వృద్ధులు, గర్భిణులు, కౌమారదశలో ఉన్న బాలికల్లో కిడ్నీ ఇన్ఫెక్షన్స్‌ కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. నోరో వైరస్‌ కంటే బర్డ్‌ఫ్లూనే ఇప్పుడు అందరినీ భయపెడుతోంది.

బర్డ్‌ఫ్లూతో ఒకరు ప్రాణం కోల్పోవటంతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది. దీంతో పక్షులు, జంతువులతో పాటు మనుషులకు కూడా హెచ్5ఎన్1 వైరస్‌ ప్రాణాంతకమేనని తేలింది. నాగ్‌పూర్‌లో డిసెంబరు మూడోవారంలో మూడు పులులు, ఓ చిరుత ఈ వైరస్‌ బారినపడి మరణించాయి. శాంపిల్స్‌ని పరీక్షలకు పంపాక అందిన నివేదికలతో వాటి చావుకు బర్డ్‌ ఫ్లూ వైరస్‌ కారణమని బయటపడింది. దీంతో దేశవ్యాప్తంగా జూలాజికల్ పార్కులు, అభయారణ్యాలు, వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రాలు, రెస్క్యూ సెంటర్లు అలర్ట్‌ అయ్యాయి. ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌గా పిలిచే బర్డ్‌ఫ్లూ సాధారణంగా పక్షులు, కోళ్లకు వస్తుంది. హెచ్5ఎన్1 రకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1997లో తొలిసారి గుర్తించింది. ఇక భారత్‌లో మాత్రం 2006లో బర్డ్ ఫ్లూ వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 2019లో మొదటిసారి మనుషుల్లో గుర్తించారు. భారత్‌లో ఏటా విదేశీ వలస పక్షుల ద్వారా బర్డ్‌ ఫ్లూ వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఓ పక్క ఈ మాయదారి రోగాలేంటని ప్రజలు తలపట్టుకుంటుంటే.. అటు మార్కెట్లు కూడా షేకవుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ యుద్ధమేఘాలు కమ్ముకున్నా, ఎక్కడ ఏ వైరస్‌ వ్యాపించినా ముందు కుప్పకూలేది స్టాక్‌మార్కెట్లే. HMPVవైరస్ ప్రభావం ప్రజలపైనే కాదు.. ఇటు స్టాక్‌మార్కెట్లపైనా పడింది. దేశంలో కొత్త వైరస్‌ కేసులు వెలుగుచూడగానే భల్లూకపు కౌగిట్లో చిక్కుకుంది మన స్టాక్‌మార్కెట్‌. ఈ వారం రోజుల్లోనే దాదాపు 15లక్షలకోట్ల మేర మదుపరుల సంపద ఆవిరైంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి