Hyderabad Water Crisis: మహానగరానికి దాహం దాహం.. పాతాళానికి భూగర్భ జలాలు.. నెలకు లక్షకు పైగా ట్యాంకర్ల బుకింగ్‌

గత ఏడాది వర్షాలు లేకపోవడంతో హైదరాబాద్‌లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో ఫిబ్రవరి నెల నుంచే నీటికి డిమాండ్ ఏర్పడింది. బోర్లపై ఆధారపడే ప్రాంతాల్లోని ప్రజలు.. నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న జలమండలిపై ఆధారపడాల్సి వచ్చింది. జలమండలి సరఫరా చేసే ట్యాంకర్లను నగరవాసులు భారీగా బుక్ చేసుకున్నారు.

Hyderabad Water Crisis: మహానగరానికి దాహం దాహం.. పాతాళానికి భూగర్భ జలాలు.. నెలకు లక్షకు పైగా ట్యాంకర్ల బుకింగ్‌
Hyderabad Water Crisis

Updated on: May 21, 2024 | 8:23 PM

గత ఏడాది వర్షాలు లేకపోవడంతో హైదరాబాద్‌లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో ఫిబ్రవరి నెల నుంచే నీటికి డిమాండ్ ఏర్పడింది. బోర్లపై ఆధారపడే ప్రాంతాల్లోని ప్రజలు.. నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న జలమండలిపై ఆధారపడాల్సి వచ్చింది. జలమండలి సరఫరా చేసే ట్యాంకర్లను నగరవాసులు భారీగా బుక్ చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో వేలాదిమంది ప్రజలు పూర్తిగా ట్యాంకర్లపైనే ఆధారపడ్డ పరిస్థితి వచ్చింది. దీంతో ట్యాంకర్లతో నీటిగా భారీగా సరఫరా చేసే స్థితి వచ్చింది. వాటర్‌ ట్యాంకర్లు బుక్‌ చేసుకున్నా, అవి రావడంలో జాప్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

24 గంటల్లో ట్యాంకర్‌ డెలివరీ

దీంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. జలమండలి ఉన్నతాధికారులతో పలుసార్లు సమీక్షలు నిర్వహించి 24 గంటల్లోపు ట్యాంకర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో జలమండలి, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. వినియోగదారులు బుక్ చేసుకున్న 24 గంటల్లోనే ట్యాంకర్ డెలివరీ చేసే స్థాయికి చేరుకుంది. జలమండలి ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు పక్కా ప్రణాళికతో పని చేశారు.

వాటర్‌ ట్యాంకర్ల సంఖ్య పెంపు.. రంగంలోకి అదనపు సిబ్బంది

డయల్ యువర్‌ ట్యాంకర్‌లో భాగంగా.. వినియోగదారులకు వేగంగా సేవలందించేందుకు మొదటిగా వాటర్‌ ట్యాంకర్ల సంఖ్యను 584 నుంచి 872కి పెంచారుజలమండలి పెంచింది. కొత్త ట్యాంకర్ల కొనుగోలుతో పాటు ఇతర సోర్సుల నుంచి అద్దెకు తెచ్చుకోవడం లాంటివి చేసింది. ఇక వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లు, వాటర్ ఫిల్లింగ్ పాయింట్లను క్రమేపి పెంచుకుంది. సరిపడా ట్యాంకర్లు ఉన్నా ఫిల్లింగ్ స్టేషన్ల దగ్గర వేచి చూసే పరిస్థితి ఉండొద్దని, ట్యాంకర్లతో పాటు పాటు ఫిల్లింగ్ పాయింట్ల సంఖ్యను కూడా పెంచారు. ఇక మూడోది..అదనపు సిబ్బందిని సమకూర్చుకుంది. ట్యాంకర్లు ఉన్నా.. వాటిని నడిపేందుకు సిబ్బంది లేకపోవడంతో, జీహెచ్ఎంసీ నుంచి కొంత మంది డ్రైవర్లను సమకూర్చుకున్నారు. దీంతో పాటు వినియోగదారులకు వేగంగా ట్యాంకర్ డెలివరీ చేసేందుకు మూడు షిఫ్టుల్లో పనిచేసేలా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఇక ట్యాంకర్ల డెలివరీ, పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసింది.

దీంతో పాటు వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా “ట్యాంకర్ మేనేజ్ మెంట్ సెల్” ఏర్పాటు చేసింది. ఈ సెల్.. జలమండలి పరిధిలోని వివిధ సర్కిళ్లు, డివిజన్లు, సెక్షన్ల నుంచి సమన్వయం చేసుకుని వినియోగదారులకు మంచి సేవలు అందించేలా చర్యలు తీసుకుంది. అన్ని ఫిల్లింగ్ స్టేషన్లలో ఉన్న సీసీ కెమెరాలు.. ప్రధాన కార్యాలయానికి అనుసంధానం కావడంతో.. వాటిని ఎప్పటికప్పుడు ఆన్ లైన్‌లో పర్యవేక్షించారు. ట్యాంకర్ బుకింగ్ మొదలు… డెలివరీ వరకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు జలమండలి ట్రాకింగ్‌ యాప్ రూపొందించింది. దీంతో వినియోగదారులు తాము బుక్ చేసుకున్న ట్యాంకర్ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఈ యాప్‌ ప్రయోగాత్మకంగా కొన్ని ఫిల్లింగ్ స్టేషన్స్‌లో అమలు చేస్తున్నారు.

సాగర్‌లో ఎమర్జన్సీ పంపింగ్‌..

ఇక హైదరాబాద్‌ వాసులకు నిరాటంకంగా తాగునీరు అందించేందుకు మరికొన్ని చర్యలు కూడా చేపట్టారు. నాగార్జున సాగర్ జలాశయంలో 10 పంపులతో ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభించారు. అవసరాన్ని బట్టి.. ఇటు ఎల్లంపల్లి జలాశయం నుంచి కూడా ఎమర్జెన్సీ పంపింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. గత ఏడాది కంటే అధిక డిమాండ్ కారణంగా, ఈ వేసవిలో జలమండలి అదనంగా నీటిని సరఫరా చేసింది. ఈ వేసవిలో 580 ఎంజీడీల నీటి సరఫరా చేశారు. గతేడాదితో పోలిస్తే.. ఇది 20 ఎంజీడీలు ఎక్కువ. నగరంలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక సరఫరా కావడం విశేషం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..