Hyderabad: ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి వచ్చిన ఐదుగురు మహిళలు.. గుంపుగా ఓ ఇంట్లోకి వెళ్లి

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు దొంగతనాలు చోటు చేసుకున్నాయి. అయితే దొంగతనాలు కామనే కావచ్చు. తరచూ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయన్న వార్తలు కూడా వింటూనే ఉంటాం. కానీ ఈ రెండు దొంగతనాలను చేసింది మాత్రం మహిళలు. ఆ వివరాలు ఇలా..

Hyderabad: ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి వచ్చిన ఐదుగురు మహిళలు.. గుంపుగా ఓ ఇంట్లోకి వెళ్లి
Telugu News

Edited By: Ravi Kiran

Updated on: Nov 01, 2025 | 2:03 PM

రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఓ ఐదుగురు మహిళలు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. అందులో భాగంగా నూతన భవనాలను టార్గెట్ గా చేసుకొని వాటిని నిర్మాణానికి ఉపయోగించే వైర్లను దొంగతనాలు చేస్తున్నారు. అయితే వాళ్లు దొంగతనాలకు పాల్పడే విజువల్స్ సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. న్యూ ఫ్రెండ్స్ కాలనీకి ఎంటర్ అయిన ఐదుగురు మహిళా దొంగలు నిర్మానుష్యంగా ఉన్న ఓ ప్రాంతాన్ని ఎంచుకుంటారు. ఆ ప్రాంతంలో నూతన నిర్మాణాలను టార్గెట్‌గా చేసుకుంటారు. తర్వాత నిర్మాణం అవుతున్న భవనానికి వెళ్తారు. అక్కడ ఉన్న ఎలక్ట్రికల్ వైర్లను దొంగతనానికి ప్రయత్నిస్తారు.

ప్రయత్నించగా ఫలితం లభించకపోతే మరొక నూతన భవనాన్ని ఎంచుకుంటారు. ఇది వీరి దొంగతనాల పనితీరు. ఇలాంటి ఘటన రాజేంద్రనగర్ న్యూ ఫ్రెండ్స్ కాలనీలో చోటు చేసుకుంది. ఏ మాత్రం అనుమానం రాకుండా ఓ ఆటోలో ఐదు మంది మహిళలు వచ్చి ఎలక్ట్రికల్ వైర్లను, కేబుల్ వైర్లను చోరీ చేస్తున్నారు. ఇది గమనించిన సదరు భవన నిర్మాణం యజమాని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది మొదటిసారి కాదని గతంలో కూడా ఇలాంటి దొంగతనాలకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే బుద్వేల్‌లో ఓ బంగారం షాప్‌నకు వచ్చిన ముగ్గురు మహిళలు షాప్ యజమానిని బురిడీ కొట్టించి పాత బంగారాన్ని తాకట్టు పెట్టి, నగదును తీసుకొని ఉడాయించారు. ఈ విధంగా రెండు వేరు వేరు ఘటనల్లో మహిళా దొంగలు చోరీలకు పాల్పడ్డారు.