Hyderabad Metro Rail Offers: ప్రయాణికులను ఆకట్టుకునేందుకు.. సులువైన ప్రయాణంపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ మెట్రో నడుంబిగించింది. పండుగ సీజన్ నేపథ్యంలో ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని నెలవారీగా లక్కీ డ్రా నిర్వహించి మెట్రో ప్రయాణికులకు బహుమతులు అందజేయాలని హైదరాబాద్ మెట్రో నిర్ణయం తీసుకుంది. మెట్రో సువర్ణ ఆఫర్ అక్టోబర్ 18 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ లక్కీ ఆఫర్ దాదాపు ఆరు నెలలపాటు అందుబాటులో ఉండనుంది. ప్రతినెలా ఐదుగురు చొప్పున ప్రయాణికులను లక్కీ డ్రాలో ప్రకటించి బహుమతులు అందిజేయనున్నారు. మెట్రో ప్రయాణికులకు ఈ ఆఫర్‌లలో ట్రిప్ పాస్, గ్రీన్ లైన్ స్పెషల్ ఛార్జీ, నెలవారీ లక్కీ డ్రా ఉన్నాయి. వీటిగురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ట్రిప్ పాస్..
ట్రిప్ పాస్ ఆఫర్ కింద.. మెట్రో ప్యాసింజర్ కేవలం 20 ట్రిప్పుల ధర చెల్లించి ఏదైనా జోన్లో 30 ట్రిప్పులను కొనుగోలు చేయవచ్చు. పది రోజుల ప్రయాణం అదనంగా లభించనుంది. ఈ ప్రయాణాలను 45 రోజుల్లో వినియోగించుకోవాలి. ఈ ఆఫర్ మెట్రో స్మార్ట్ కార్డ్ (పాతది – కొత్తది) ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. మెట్రో ప్రయాణికులు అక్టోబర్ 18 నుంచి జనవరి 15 వరకు ఈ ఆఫర్‌ను పొందవచ్చు.
గ్రీన్ లైన్ స్పెషల్ ఛార్జీ..
గ్రీన్ లైన్‌లో ప్రత్యేక ఛార్జీల విషయానికొస్తే.. ప్రయాణీకులు ఎంజీబీఎస్, జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌ల మధ్య గ్రీన్ లైన్లో ప్రతి ట్రిప్‌కు గరిష్టంగా రూ .15 మాత్రమే చెల్లించి ప్రయాణించవచ్చు. మెట్రో ప్రయాణీకులు ఈ ఆఫర్‌ను అక్టోబర్ 18 నుంచి జనవరి 15 వరకు పొందవచ్చు.
లక్కీ డ్రా..
నెలవారీ లక్కీ డ్రాలో భాగంగా ప్రయాణికులకు అక్టోబర్ నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు ఆకర్షణీయమైన బహుమతులు లభించనున్నాయి. ప్రతి నెల.. మెట్రో ప్రకటించిన విధంగా నెలలో స్మార్ట్ కార్డు ద్వారా కనీసం 20 సార్లు ప్రయాణించిన వారికి ఈ ఆఫర్ లభించనుంది. లక్కీ డ్రాలో భాగంగా ప్రతినెల ఐదుగురు విజేతలను ప్రకటించనున్నారు. ప్యాసింజర్లు ఈ పథకానికి అర్హులు కావాలంటే.. టి-సవారీ యాప్ ద్వారా ప్రయాణం లేదా మెట్రో స్టేషన్లలో కాంటాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డ్ తీసుకోని ఉండాలి. నెలలో 20 సార్లు ప్రయాణించాల్సి ఉంటుంది.
Also Read: