హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ తిప్పలు తప్పేలాలేదు. ఇప్పటికే మూడు రోజుల్నుంచి నగర రోడ్లపై ట్రాఫిక్‌తో ముప్పుతిప్పలు పడుతోన్న నగర ప్రజలకు మున్ముందు మరిన్ని ఇబ్బందులు తప్పవనేలా పరిస్థితులు నెలకొన్నాయి. మంగళ, బుధవారాలు ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చింది. ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు ప్రధాన రహదారులు, వీధులూ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఓవైపు శాసనసభ సమావేశాలు, ఫిబ్రవరి 11న ఫార్ములా-ఈ రేసింగ్ అంతర్జాతీయస్థాయిలో జరిగే పోటీలు, ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్, ఫిబ్రవరి 17న నూతన సచివాలయం ప్రారంభం, ఫిబ్రవరి 18న శివరాత్రి వేడుకలు ఇలా వరుస కార్యక్రమాలు నెలకొన్న నేపథ్యంలో మరో 10 రోజులపాటు వాహనదారులు ట్రాఫిక్ నరకం తప్పేలాలేదు. ట్రాఫిక్ పోలీసులు 24 గంటలు విధులు నిర్వర్తిస్తున్నా పరిస్థితిని చక్కదిద్దటం సవాలుగా మారింది.
గ్రేటర్ హైదరాబాద్‌లో 80 లక్షలకుపైగా వాహనాలున్నాయి. వీటిలో 30 నుంచి 40 లక్షలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయని అంచనా. సాధారణంగా ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో కేవలం 10 నుంచి 12 కిలోమీటర్ల దూరానికే రోడ్లపై 30 నుంచి 40 నిమిషాలు వెచ్చించాల్సి వస్తోంది. ఐతే గత కొద్దిరోజులుగా కిలోమీటరు దూరానికే గంట సమయం పడుతోందంటూ వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలే ప్రధాన కారణమంటున్నారు పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై నిత్యం సుమారు 17,000 చలానాలు నమోదవుతున్నాయని పోలీసులు తెలుపుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.