
తెలంగాణలో (TRS) రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో పొలిటికల్ హీట్ నెలకొంది. దీంతో మునుగోడులో ఉపఎన్నిక దాదాపు ఖరారైపోయింది. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, ప్రతిపక్షమైన కాంగ్రెస్ ల మధ్య పొత్తు ఉండనుందా అనే విషయంపై తీవ్రంగా చర్చ నడుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ దిగ్విజయ్ సింగ్ ఈ మధ్య ‘సీఆర్ తమతో కలవచ్చుగా అంటూ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్,-టీఆర్‌ఎస్ పొత్తులపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నోరు విప్పారు. టీఆర్ఎస్ (TRS) తో కలిసే విషయంపై కీలక ప్రకటన చేశారు. కలలో కూడా టీఆర్‌ఎస్‌తో పొత్తు సాధ్యం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో (Bharat Jodo Yatra) పాల్గొంటున్న పార్టీ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలిశారు.
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ జాడ లేకుండా చేసేందుకే కేసీఆర్ బీజేపీని ప్రోత్సహించారని, ఇప్పుడు అదే బీజేపీ కేసీఆర్ పాలిట శాపంగా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా టీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని వరంగల్ సభలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనపై యుద్ధం చేసి తీరతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పాపాలను మోసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదన్ని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ కనీసం పది సీట్లు గెలవలేదని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.
మరోవైపు.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రెండో రోజుకు చేరింది. కన్యాకుమారిలోని అగస్తీశ్వరంలో గురువారం యాత్ర ప్రారంభమైంది. అగస్తీశ్వరం నుంచి నాగర్‌కోయిల్ వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఇవాళ భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భఘేల్ తో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు పలువురు జాతీయ స్థాయి నేతలు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..